ప్రాణం తీసిన బిస్కెట్.. ఇద్దరు చిన్నారులు మృతి, ఒకరి పరిస్థితి విషమం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విషాదం నెలకొంది. బిస్కెట్ తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చింతకొమ్మదిన్నె గ్రామంలో బిస్కెట్ ప్యాకెట్ కొన్న ముగ్గురు చిన్నారులు.. అది తినడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమించడంతో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు అంటే ఎంతో ఇష్టం. ఆ బిస్కెట్లే ఇప్పుడు ఇద్దరు పిల్లల ప్రాణం తీశాయి. చింతకొమ్ముదిన్నె గ్రామానికి చెందిన మాబు దగ్గర ఆయన మనవడు, మనవరాళ్లు హుస్సేన్ భాష, జమాల్ బీ, హుస్సేన్‌బీ డబ్బులు తీసుకుని.. సమీపంలోని ఓ షాపులో Rose Mango బిస్కెట్ ప్యాకెట్ కొని తెచ్చుకున్నారు. అందులోని బిస్కెట్లు తిన్నారు. కాసేపటికే వారికి కడుపు నొప్పి మొదలైంది.
https://10tv.in/looking-for-a-daddy-this-uk-man-will-take-care-of-your-kids-like-a-father-for-rs-2500-an-hour/
ఈ విషయాన్ని పిల్లలు పెద్దలకు తెలిపారు. కంగారు పడిన కుటుంబసభ్యులు వెంటనే వారిని ఆళ్లగడ్డలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ హుస్సేన్‌భాష మృతిచెందాడు. ఆ తర్వాత మరొకరు చనిపోయారు.
చిన్నారులు బిస్కెట్లు తిన్న వెంటనే అస్వస్థతకు లోనయ్యారని, అవి పూర్తిగా విషతుల్యం అయ్యాయని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బిస్కెట్, చిన్నారుల ప్రాణం తీసిందనే వార్త చిన్న పిల్లల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది. అసలేం జరిగిందోనని అంతా కంగారు పడుతున్నారు. ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.