ఏపీలో దారుణం.. ప్రియుడితో భర్తను హత్యచేయించిన భార్య.. పోలీసులకు ఎలా దొరికిపోయారంటే..!

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో చెప్పి తన భర్తను భార్య హత్య చేయించింది.

ఏపీలో దారుణం.. ప్రియుడితో భర్తను హత్యచేయించిన భార్య.. పోలీసులకు ఎలా దొరికిపోయారంటే..!

Updated On : June 26, 2025 / 8:01 AM IST

Andhrapradesh: గద్వాల్ జిల్లాకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్‌ను అతని భార్య ప్రియుడితో కలిసి పెళ్లయిన నెలరోజుల్లోనే హత్య చేయించిన ఘటన మరవక ముందే ఏపీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాను వేరే వ్యక్తితో పెట్టుకున్న సంబంధాన్ని మందలిస్తున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. ఈ దారుణ ఘటన ఏపీలోని అనంతపురం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటన వెలుగులోకి వచ్చిన ఆరు గంటల్లోనే అనంతపురం రూరల్‌ పోలీసులు మిస్టరీని ఛేదించారు.

Also Read: Ys Sharmila: సింగయ్య మృతి ఘటన.. బల ప్రదర్శన యాత్రల వల్లే ప్రమాదాలు, జగన్ పర్యటనలను నిషేధించాలి- షర్మిల సంచలన వ్యాఖ్యలు

అనంతపురం జిల్లా కంబదూరు మండలం పాళ్లూరు వెంకటాంపల్లికి చెందిన కుమ్మర నరసాపురం సురేశ్ బాబు (43), అనిత దంపతులు. వారు పిల్లలతో కలిసి నగర శివారు సదాశివకాలనీలో ఉంటున్నారు. సురేశ్ హోటల్ నడుపుతున్నాడు. భార్య అనిత ఓ హోటల్ లో దినసరి కూలీగా పనిచేస్తుంది. అదే కాలనీలో ఉంటున్న బాబావలీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. భార్య తరచూ ఫోన్లో మాట్లాడటం గమనించిన భర్త సురేశ్ బాబు పలుసార్లు ప్రశ్నించాడు. అనుమానంతో మద్యం తాగివచ్చి వేదిస్తుండేవాడు. దీంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించాలని అనిత ప్లాన్ వేసింది.

Also Read: Tejeswar Case: ముందుగా భార్యనే చంపాలని బ్యాంక్ మేనేజర్ ప్లాన్.. తేజేశ్వర్ హత్యకు 5సార్లు రెక్కీ.. గద్వాల సర్వేయర్ కేసులో సంచలన విషయాలు

భర్తను హత్య చేయాలని పదిరోజుల నుంచే భార్య పథకం పన్నింది. పథకం ప్రకారం.. మంగళవారం రాత్రి ప్రియుడు బాబావలీకి ఫోన్ చేసి.. తన భర్త మద్యం తాగి ఒంటరిగా ఇంటికి వస్తుంటాడని, దారికాచి ఈ రోజే హత్య చేయాలని చెప్పింది. దీంతో బాబావలీ దారిమధ్యలో కాపుకాసి బీరు బాటిల్ తో సురేశ్ బాబుపై దాడి చేశాడు. అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా.. తనతో తెచ్చుకున్న స్క్రూడ్రైవర్ తో పొడిచి చంపేశాడు. ఆ తరువాత బండరాయితో అతని తలపై పలుసార్లు మోది చంపేశాడు. బుధవారం తెల్లవారు జామున కొందరు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఘటనస్థలిలో గుమ్మికూడారు. అక్కడికి వచ్చిన బాబావలీ.. మృతుడి వివరాలను పూసగుచ్చినట్లు చెప్పి వెళ్లిపోయాడు. అతనిపై పోలీసులకు అనుమానం రావడంతో జాగిలంతో నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నించారు.

జాగిలం నేరుగా వెళ్లి నిందితుడు బాబావలీ ఇంటి పరిసరాల్లో ఆగింది. ఈ విషయం తెలుసుకున్న బాబావలీ తప్పించుకొనేందుకు ప్రయత్నించాడు. ఆటోలో వెళ్తుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తాను సురేశ్ బాబును హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో మృతుడు భార్య అనితను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.