CAG Report in AP Assembly : ఏపీ అసెంబ్లీకి కాగ్ నివేదిక .. కీలక అంశాల ప్రస్తావన
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. ఈక్రమంలో సభ ముందుకు కాగ్ నివేదిక వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పలు కీలక అంశాలను కాగ్ ప్రస్తావించింది.

CAG Report in Andhra Pradesh Assembly
CAG Report in AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. ఈక్రమంలో సభ ముందుకు కాగ్ నివేదిక వచ్చింది. ఈ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కాగ్ నివేదికను బుగ్గన ప్రవేశ పెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పలు కీలక అంశాలను కాగ్ ప్రస్తావించింది. 2020-21లో ఏపీ గత ఐదేళ్లలో కంటే అతి తక్కువ జీఎస్‌డీపీ వృద్ధి రేటు నమోదు చేసిందని..2020-21లో రాష్ట్ర ప్రభుత్వ నగదు నిల్వ ర.4,202 కోట్ల మేర తగ్గాయని కాగ్ నివేదిక పేర్కొంది. కోవిడ్ వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వృద్ధి రేటు 1.58 శాతమేనని వెల్లడించింది.
కోవిడ్ వల్ల వ్యవసాయ రంగం మినహీ అన్ని రంగాలు దెబ్బతిన్నాయని వెల్లడించిన కాగ్ ..గతంతో పోలిస్తే రెవెన్యూ రాబడి, వసూళ్లు పెరిగాయని వెల్లడించింది. కోవిడ్ సహాయ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రూ.337.25 కోట్లు అని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు రూ.33,230 కోట్లు అని పేర్కొంది. 2020-21 ఏపీ సొంతపన్నుల రాబడి 0.33 తగ్గిందని తెలిపిన కాగ్ భారత ప్రభుత్వం నుంచి ఏపీ పొందే గ్రాంట్లు 45.69గా ఉందని పేర్కొంది.రెవెన్యూ ఖర్చులు 11.06 శాతం మేర పెరుగగా..సామాజిక సేవలపై రెవెన్యూ ఖర్చు 3.10శాతం తగ్గుదల ఉందని తెలిపింది.ఆర్థిక సేవలపై రెవెన్యూ ఖర్చు 56.11శాతం పెరుగుదల ఉందని తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ప్రజారుణం 44.07 శాతం మేర పెరిగిందని వెల్లడించింది. 2020-21లో రూ.1,17,136 కోట్ల రెవెన్యూ రాబడులు ఉంటే..రూ.20,018 కోట్లు వడ్డీ చెల్లింపులు ఉన్నాయంది.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎమ్ చట్టాన్ని 2020 డిసెంబర్ లో సవరించింది… కానీ చట్ట సవరణలు మాత్రం ఆగస్టు 30, 2020 నుండి అమల్లోకి వచ్చాయని నివేదికలో పేర్కొంది. ఈ సవరణలు 2015-16 నుంచి అమల్లోకి వచ్చినట్లు సవరణ చేసిందని, రెవెన్యూ, ద్రవ్య, ప్రాధమిక లోటు కొలమానాలు 2016-21 కాలంలో నెగిటివ్ గా ఉన్నాయని కాగ్ తేల్చింది. రెవెన్యూ ఖర్చులను క్యాపిటల్ వ్యయంగా, ప్రభుత్వ పద్దులలో ఇతర రుణాలు చూపకపోవడం జరిగిందని కాగ్ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయని కాగ్ పేర్కొంది.