ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందా? : రాజధాని రైతులు

అభివృద్ధిని వికేంద్రీకరించాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. మూడు రాజధానుల ఆలోచనను అసెంబ్లీ సాక్షిగా సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ నిర్ణయంపై రాజధాని గ్రామాల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులు, రాజధాని వాసులు.
ఈ క్రమంలో గ్రామాల్లోని రైతులు ఒక్క దగ్గర చేరి రాజధాని ప్రకటన మార్పు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రులు మారితే రాజధానిని మారుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనను నిరసిస్తూ బుధవారం ఉదయం మందడం గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎన్నికలు ముందు రాజధాని మార్పు ప్రకటన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి డబ్బులు లేవని చెప్పి, మూడు రాజధానులు కట్టడానికి డబ్బులు ఎలా తెస్తారని నిలదీశారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని జగన్ భూముల కోసమే ఇదంతా చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహించారు.
అమరావతి రైతులకి నష్టపరిహారం కట్టేసి పొలాలు చదును చేసేసి అప్పజెప్పాలంటూ మరికొంతమంది రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రైతులకి భూములు అప్పజెప్పి రైతులని వేరే ప్రైవేట్ సంస్థలకి ఇచ్చుకునే ఫెసిలిటీ ఇవ్వాలని అంటున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధం అని అంటున్నారు రైతులు.
మరోవైపు సౌతాఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్.. ఏపీలో ఆఫ్రికా సంస్కృతి తీసుకొస్తారా? అని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఏటా తుపానులతో విశాఖ ఎంతో నష్టపోతోందని, అమరావతిలో వరదలు వస్తాయని చెప్పడాన్ని తప్పు పట్టారు రైతులు.