Kodali Nani: కొడాలి నాని టార్గెట్‌గా పావులు కదులుతున్నాయా?

ఇలా పక్కా ఎవిడెన్స్ సేకరించి.. ఇప్పటివరకు అరెస్ట్ అయిన నేతలకు భిన్నంగా నానిని కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

Kodali Nani: కొడాలి నాని టార్గెట్‌గా పావులు కదులుతున్నాయా?

kodali nani

Updated On : March 20, 2025 / 8:35 PM IST

కొడాలి నాని.. వైసీపీ మాస్‌ లీడర్‌. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సైలెంట్‌గా ఉంటున్నారు. ఆయన పేరు మాత్రం లైమ్‌లైట్‌లోనే ఉంటుంది. రేపోమాపో కొడాలి అరెస్ట్ అంటూ సోషల్‌ మీడియాలో కూటమి క్యాడర్ రచ్చరచ్చ చేస్తోంది. అయితే, చంద్రబాబు, లోకేశ్, పవన్‌తో పాటు వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యంగా మాట్లాడారంటూ పలువురు వైసీపీ నేతలను ఇప్పటికే అరెస్టు చేశారు పోలీసులు.

ఈ క్రమంలోనే వల్లభనేని వంశీతో పాటు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కొడాలి నాని వంతు వచ్చిందని చర్చ స్టార్ట్ అయింది. అటు కూటమి, ఇటు వైసీపీ సర్కిల్స్‌లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. అయితే రెడ్‌బుక్‌లో అందరి కంటే ముందే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పేరుంటుందన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన పేరు మొదటి అధ్యాయంలో కాక సెకండ్ చాఫ్టర్‌లోకి షిఫ్ట్ చేశామని టీడీపీ నేతలు ఆఫ్‌ ది రికార్డులో చెప్తుండటం చర్చనీయాంశం అవుతోంది.

అయితే ఊహించని విధంగా ఓ కేసు కొడాలి నానిని ఇరకాటంలో పడేస్తోంది. చంద్రబాబు, లోకేశ్‌పై అసభ్యకర మాట్లాడారంటూ నమోదైన కేసులో నానిని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతుండగా..అందుకు భిన్నంగా ఓ పాత కేసు తెరమీదకు వచ్చింది. పోలీసులను అవమానించేలా, వారి ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారంటూ మచిలీపట్నంలో నాని మీద కేసు ఫైల్ అయింది. గత ఏడాది జూన్‌లో నమోదు చేసిన కేసును ఇప్పుడు అటక మీద నుంచి కిందకు దించగా ఆయనను జైలుకు పంపేందుకు ముహూర్తం సిద్ధం చేస్తున్నారట. ముందే జాగ్రత్తపడుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు కొడాలి నాని.

మచిలీపట్నంలో నమోదైన కేసులో..
కూటమి అధికారంలోకి వచ్చాక ఆయనపై వరుస కేసులు నమోదు అవుతుండగా, రెండింట్లో ముందస్తు బెయిల్ మంజూరు కాగా, విశాఖ కేసులో నోటీసులివ్వాలని కోర్టు సూచించింది. ఇక మచిలీపట్నంలో నమోదైన కేసులో కొడాలిని అరెస్టు చేస్తారనే భయం పట్టుకుందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ కేసును కొట్టివేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు గుడివాడ టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడితో పాటు అక్రమ మైనింగ్, భూకబ్జాలపైనా కొడాలిపై కేసులు నమోదు చేయనున్నారని అంటున్నారు.

జగనన్న కాలనీకు సంబంధించిన భూసేకరణలో కూడా గోల్‌మాల్ చేశారని నానిపై అలిగేషన్స్ ఉన్నాయి. దీంతో ఆయన ఒక్కో కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తూ వస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల కాలంలో కొడాలి రెండు మూడు సార్లు మాత్రమే బయటకు వచ్చారు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన పెద్దగా హాజరుకావడం లేదు.

కొడాలి నానినే కాదు ఆయన అనుచరులను కూడా కేసులు చుట్టుముడుతున్నాయి గతంలో ఓ రెండు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొడాలి నాని అనుచరులకు షాకిచ్చారు పోలీసులు. వారిపై వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించారని, లిక్కర్ గౌడౌన్ వ్యవహారంలో బెదిరించిన కేసులు ఉన్నాయి.

వీటిలో కొడాలి నాని ప్రధాన అనుచరులుగా పేరున్న దుక్కిపాటి శశిభూషణ్‌తో పాటు పాలడుగు రాంప్రసాద్, గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ రెండు కేసుల్లో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు అప్పటి ఏపీ బెవరేజేస్ కార్పోరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, జేసీ మాధవీలతపై గతంలో వివిధ సెక్షన్ల కింద గుడివాడ పోలీసులు కేసులు పెట్టారు. ఇప్పుడు అతని అనుచరుల విచారణ తర్వాత కొడాలి నానికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా పక్కా ఎవిడెన్స్ సేకరించి.. ఇప్పటివరకు అరెస్ట్ అయిన నేతలకు భిన్నంగా నానిని కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళిలో ఎవరికో ఒకరికి బెయిల్‌ వచ్చేలోపే నాని అరెస్ట్ ఉంటుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి మరి.