Package For Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్లతో ప్యాకేజీ.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం
దీనిపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Package For Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11వేల 440 కోట్ల రూపాయలతో ప్యాకేజీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రకటన చేశారు. రూ.11,440 కోట్లతో ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు భారీ ప్యాకేజీ ప్రకటించింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దని కొన్నేళ్లుగా కార్మికుల ఉద్యమాలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దని కార్మిక సంఘాలు గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు భారీ ప్యాకేజీ ప్రకటించాలని ఎప్పటి నుంచో కోరుతున్నాయి. అటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సైతం ఉక్కు పరిశ్రమ పరిరక్షణ లక్ష్యంగా పోరాటాలు చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై అనేక అనుమానాలు, భయాలు నెలకొన్న వేళ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. స్టీల్ ప్లాంట్ కు భారీ ప్యాకేజీ అనౌన్స్ చేసింది.

Vizag Steel Plant
నష్టాల్లో ఉన్న ప్లాంట్ గట్టెక్కేందుకు ఉపయోగపడనున్న ఆర్థిక ప్యాకేజీ..
ఆర్థిక కష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నష్టాల్లో ఉన్న ఉక్కు పరిశ్రమకు ఈ ప్యాకేజీ కొత్త ఊపిరి అందించనుందని కార్మిక సంఘాలు అభిప్రాయపడ్డాయి. స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం ఆర్థిక ప్యాకేజీని కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
Also Read : మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు
నిన్న జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై చర్చించింది. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ ప్రతిపాదనకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదని గతంలోనే కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ఆర్థిక ప్యాకేజీపై ఇటీవలే ప్రధాని మోదీని కలిసి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
స్టీల్ ప్లాంట్ ను ఎలా నడపాలి అనే అంశంపై చర్చలు..
ఇక 11,440 కోట్ల రూపాయలను ఏ విధంగా ఖర్చు చేయాలి, ఎలా నిర్వహించాలి అనేదానిపై కేంద్రం గైడ్స్ లైన్స్ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో స్టీల్ ప్లాంట్ లో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమార స్వామి పర్యటించారు. కచ్చితంగా ఉక్కు పరిశ్రమను నష్టాల నుంచి బయటకు తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఇందుకోసం దాదాపుగా మూడు నెలల సమయం కావాలని ఆయన అడిగారు.
స్టీల్ ప్లాంట్ గట్టెక్కాలంటే 18వేల కోట్ల రూపాయలు అవసరమని విశాఖకు చెందిన మంత్రులు, ఎంపీలు చెప్పడం జరిగింది. ఈ అంశాలను కేంద్రం పరిగణలోకి తీసుకుంది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా ఏ విధంగా నడపాలి అనేదానిపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఉక్కు పరిశ్రమ నష్టాల నుంచి గట్టెక్కేందుకు భారీ ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Also Read : లీడర్, క్యాడర్ గప్‌చుప్..ఇట్లైతే ఫ్యాన్ తిరిగేదెట్లా.?