IPS Siddharth Kaushal: ఏపీ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాకు కేంద్రం ఆమోదం..

తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని తన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు.

IPS Siddharth Kaushal: ఏపీ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాకు కేంద్రం ఆమోదం..

Updated On : July 11, 2025 / 10:48 PM IST

IPS Siddharth Kaushal: ఏపీ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద పదవి విరమణకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2012 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. దీనిపై రకరకాల ప్రచారాలు జరిగాయి. రాజకీయ రంగు పులుముకుంది. చంద్రబాబు సర్కార్ ఒత్తిళ్లు, రాజకీయ వేధింపుల వల్లే ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్ తీసుకున్నారని ప్రతిపక్ష వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది.

కాగా, పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే పదవికి రాజీనామా చేశానని.. తన రాజీనామా వెనుక ఎలాంటి బలవంతం కానీ, ఒత్తిళ్లు కానీ, రాజకీయ వేధింపులు కానీ లేవని స్పష్టం చేశారు సిద్ధార్థ్ కౌశల్. దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలు, కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాజకీయ వేధింపులు, ఒత్తిళ్లతో రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని సిద్ధార్థ్ కౌశల్ వివరించారు.

Also Read: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం.. నిందితుల ఆస్తుల జప్తునకు కోర్టు అనుమతి

తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని తన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వానికి, సహచరులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సిద్ధార్ధ్ కౌశల్. రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గాల్లో సేవలు అందిస్తానని లేఖ ద్వారా తెలిపారు. ఐపీఎస్‌గా సేవ చేయడం ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. ఏపీని సొంత ఇల్లుగా భావించానని.. ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ హృదయంలో నిలిచి ఉంటాయన్నారు. కౌశల్. మీ మద్దతు, నమ్మకం తనను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయన్నారు. రాబోయే రోజుల్లో కొత్త మార్గాల్లో సమాజానికి సేవ చేస్తానన్నారు కౌశల్.

సిద్ధార్ధ్ కౌశల్ 2012 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల ఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత ఏపీ డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా విధులు ఇచ్చారు. గత వైసీపీ సర్కార్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా పని చేశారనే ఆరోపణలు కౌశల్ పై ఉన్నాయి.