AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం.. నిందితుల ఆస్తుల జప్తునకు కోర్టు అనుమతి
ప్రతివాదులకు ఆగస్ట్ 1వ తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

AP Liquor Scam: ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కేసులో నిందితుల ఆస్తుల జప్తునకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్టు.. నిందితుల ఆస్తుల జప్తునకు అనుమతి ఇచ్చింది. ప్రతివాదులకు ఆగస్ట్ 1వ తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి రూ.32 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. వీటిలో గత ఏడాది ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ జిల్లాలోని చిల్లకల్లు వద్ద పట్టుబడిన రూ.8కోట్ల నగదుతో పాటు డిస్టిలరీలు, నిందితుల అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సేకరణ, పంపిణీ, ధరల నిర్ణయంలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో అప్పట్లో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ పాత్రపైనా సిట్ దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు ప్రముఖులను విచారించి కొందరిని అరెస్ట్ చేసిన సిట్.. ఇప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్ అయిన రజత్ భార్గవకు కూడా నోటీసు జారీ చేసి విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది.
Also Read: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఇక లేనట్లేనా..? అదొక ముగిసిన అధ్యాయమేనా..?
ఎక్సైజ్ శాఖలో కీలక స్థానంలో పనిచేసిన రిటైర్డ్ అయ్యారు రజత్ భార్గవ. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయనకు నోటీసులు జారీ చేసింది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సిట్ స్పష్టం చేసింది. ఎక్సైజ్ శాఖను ప్రైవేట్ వ్యక్తులకు వదిలేసినట్లుగా రజత్ భార్గవపై ఆరోపణలున్నాయి.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కేసులో నిందితుల బ్యాంక్ ఖాతాల అటాచ్ మెంట్ కు పోలీసులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
* అదాన్ డిస్టిలరీస్ కు చెందిన 20 కోట్ల నగదు కలిగిన బ్యాంకు ఖాతా సీజ్
* అదాన్ డిస్టిలరీస్ కు చెందిన 10.01 కోట్ల నగదు కలిగిన బ్యాంక్ ఖాతా సీజ్
* లీలా డిస్టిలరీకి చెందిన 2.85 కోట్ల నగదు కలిగిన బ్యాంకు ఖాతా సీజ్
* మద్యం కేసులో నిందితులకు చెందిన మొత్తం 3 బ్యాంకు ఖాతాల్లో రూ.32.86 కోట్ల నగదు అటాచ్ మెంట్
* తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్
* ఇప్పటికే 30 కోట్ల విలువ చేసే ఆస్తులను సీజ్ చేస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం
* తాజా ఆదేశాలతో 62.86 కోట్లకు చేరిన నిందితుల ఆస్తులు, నగదు అటాచ్ మెంట్.