ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఇక లేనట్లేనా..? అదొక ముగిసిన అధ్యాయమేనా..?

వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం పెద్దగా మాట్లాడడం లేదు.

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఇక లేనట్లేనా..? అదొక ముగిసిన అధ్యాయమేనా..?

Updated On : July 11, 2025 / 8:51 PM IST

ఏపీలో ఇక వాలంటీర్ల వ్యవస్థ కనిపించదా.. అదొక ముగిసిన అధ్యాయమేనా..? కూటమి ప్రభుత్వమే కాదు.. వైసీపీ సైతం వాలంటీర్ల విషయంలో ఒక డెసిషన్‌కు వచ్చేసిందా.? వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది. ఎన్నికల ముందు వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పిన కూటమి.. ఇప్పుడెందుకు వారిని సైలెంట్‌మోడ్‌లో పెట్టేసింది.? ఇంతకీ ఏపీలో రాజీనామా చేయని వాలంటీర్ల పరిస్థితి ఏంటి..?

ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను సైడ్ చేశారు. వాలంటీర్లు సేవలను వాడకుండానే పెన్షన్లను ఇచ్చేస్తున్నారు. రేషన్‌ బండ్లతో పనిలేకుండానే సరుకుల్ని పంచేస్తున్నారు. ఏపీలో ఇక వాలంటీర్ల అవసరం లేకుండా పోయింది. వాలంటీర్ల వ్యవస్థ వల్లే వైసీపీకి నష్టం జరిగిందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇటు వైసీపీ సైతం అదే నిజమని భావిస్తోంది. అందుకే కూటమి సర్కార్ కూడా వాలంటీర్ల వ్యవస్థను టచ్ చేయడం లేదట.

వాలంటీర్ల వ్యవస్థ విషయంలో వైసీపీ కూడా ఓ క్లారిటీకి వచ్చేసినట్టు ఆ పార్టీ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ ఇక నుంచి వాలంటీర్ల వ్యవస్థ జోలికి వెళ్లకూడదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తాజాగా దీనిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే పార్టీ అంతర్గత మీటింగ్‌లో మాట్లాడారని తెలుస్తోంది. వాలంటీర్ల వ్యవస్థ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారాయన. వాలంటీర్ల వ్యవస్థ అనేది ముగిసిన అధ్యయం కానుంది. కూటమి ప్రభుత్వమే కాదు భవిష్యత్‌లో వైసీపీ కూడా వాలంటీర్ వ్యవస్థ జోలికి పోయేలా కనిపించడం లేదు. ఆ వ్యవస్థతోనే వైసీపీకి దారుణ పరాజయం ఎదురైందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారట.

Also Read: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 34 శాతం జీతాల పెంపు? ఏయే మార్పులు జరగనున్నాయి?

నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల పార్టీ శ్రేణులతో కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరమయ్యారని అన్నారు. తాను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించానని చెప్పుకొచ్చారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే మూలస్తంభాలని, వాలంటీర్లు కాదని హైకమాండ్‌కు చెప్పారట.

వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరోసారి వలంటీర్ వ్యవస్థ జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేసినట్లు స్వయంగా పార్టీ సమావేశంలోనే చెప్పారట. అయితే మాజీ ఎమ్మెల్యే అభిప్రాయాన్ని ఆ పార్టీ శ్రేణులందరూ ముక్తకంఠంతో ఆహ్వానించారట. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఇదే అభిప్రాయంతో ఉన్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.  2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ వ్యవస్థను ప్రారంభించింది వైసీపీ ప్రభుత్వం. ప్రతి 50 కుటుంబాల బాధ్యతను వారికి అప్పగించింది. దీంతో వైసీపీ నాయకత్వానికి, పార్టీ శ్రేణులకు పని లేకుండా పోయింది.

వైసీపీ క్యాడర్‌, స్థానిక నేతలకు ప్రజలతో గ్యాప్
ప్రభుత్వం అంటే వలంటీర్ వ్యవస్థ అనే భావన ప్రజల్లో పాతుకుపోయింది. ప్రతి చిన్న అవసరానికి జనం వాలంటీర్ల చుట్టూ తిరిగారు. వైసీపీ క్యాడర్‌, స్థానిక నేతలకు ప్రజలతో గ్యాప్ ఏర్పడింది. అప్పట్లో వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ ప్రజా ప్రతినిధులే పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. కానీ మాజీ సీఎం జగన్ లెక్క చేయలేదు. సరిగ్గా ఎన్నికల ముందు వాలంటీర్ వ్యవస్థను నిలిపివేసింది ఎన్నికల కమిషన్. దీంతో చాలామంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. అయితే కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని.. రాజీనామాలు చేయవద్దని విజ్ఞప్తితో.. సగం మంది రాజీనామాలు చేయలేదు.

అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదన్నర అవుతోంది. కానీ వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం పెద్దగా మాట్లాడడం లేదు. వాలంటీర్ వ్యవస్థ మూలంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందన్నది మెజారిటీ పార్టీ శ్రేణుల అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను సమర్థిస్తే.. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని అమలు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం డైలామాలో ఉందట. అందుకే ఈ వ్యవస్థ విషయంలో కూటమి బాటలోనే నడవాలని వైసీపీ నిర్ణయించుకుందని పొలిటికల్ సర్కిళ్లలో మెయిన్ డిబెట్ పాయింట్‌గా మారింది.

ఫైనల్‌గా వాలంటీర్ల వ్యవస్థకు తెరపడినట్లేనన్న టాక్‌ వినిపిస్తోంది. భవిష్యత్‌లో కార్యకర్తలకే ప్రయారిటీ ఇస్తామని స్వయంగా పార్టీ అధినేత జగన్‌ అంటున్నారు. అంటే వాలంటీర్లు ఉండరని చెప్పకనే చెప్తున్నారు జగన్. అలా అధికార, అపోజిషన్‌ వార్‌ మధ్య వాలంటీర్‌ వ్యవస్థ కనుమరుగైనట్లేనన్న ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి.