టీడీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు.. చంద్రబాబు, లోకేశ్ ప్లెక్సీలను తగలబెట్టిన కార్యకర్తలు

టీడీపీలో సీట్ల సర్దుబాటుపై తర్జన భర్జన కొనసాగుతుంది. తాజాగా.. నలుగురు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మార్పులు చేశారు.

టీడీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు.. చంద్రబాబు, లోకేశ్ ప్లెక్సీలను తగలబెట్టిన కార్యకర్తలు

Nallimilli Rama Krishna Reddy

TDP MLA Candidates : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరో మూడు రోజుల్లో నామినేషన్ల గడువు ముగియనుంది.. అయినా, ఇంకా టీడీపీలో సీట్ల సర్దుబాటుపై తర్జన భర్జన కొనసాగుతుంది. తాజాగా.. నలుగురు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మార్పులు చేశారు. గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే ఉండి నియోజకవర్గం సీటును రఘురామ కృష్ణం రాజుకు టీడీపీ అధిష్టానం కేటాయించింది. మాడుగుల నియోజకవర్గం టికెట్ ను బండారు సత్యనారాయణమూర్తి దక్కించుకోగా.. పాడేరు టికెట్ ను గిడ్డి ఈశ్వరికి టీడీపీ హైకమాండ్ కేటాయించింది. మడకశిర నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజు బరిలోకి దిగుతున్నారు. అదేవిధంగా వెంకటగిరి స్థానాన్ని లక్ష్మీప్రియ నుంచి ఆమె తండ్రి కురుగొండ్ల రామకృష్ణ కు మార్పు చేశారు.

Also Read : Telangana Congress Party : ఆ మూడు స్థానాల్లో బరిలో నిలిచేదెవరు? ఇవాళ ప్రకటించనున్న కాంగ్రెస్

దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీ- ఫారాలును టీడీపీ అధినేత చంద్రబాబు పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అనపర్తి వ్యవహారంపై క్లారిటీ వచ్చాక దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీ- ఫారాలు ఇవ్వనున్నట్లు సమాచారం. అనపర్తి టికెట్ ఆశించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తరపున పోటీచేసే అవకాశం ఉంది. నల్లమిల్లి బీజేపీలోచేరి అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులకు బీఫారమ్ లు అందజేశారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు.

Also Read : Cm Jagan : నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన నిన్ను ఏమనాలి?- చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్   

ఉండి నియోజకవర్గం అభ్యర్థిగా తొలుత మంతెన రామరాజును చంద్రబాబు ప్రకటించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ స్థానంలో రఘురామ కృష్ణంరాజును అభ్యర్థిగా ప్రకటించారు. తొలుత మంతెన, ఆయన మద్దతు దారులు ఆందోళనకు దిగినప్పటికీ.. చంద్రబాబు సూచనలతో వెనక్కు తగ్గారు. దీంతో మంతెన రామరాజును నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటి వరకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో అభ్యర్థి మార్పుపై ఆ పార్టీలో అసమ్మతి భగ్గుమంది. గత కొద్దిరోజుల క్రితం డాక్టర్ సునీల్ కుమార్ పేరును మడకశిర అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తాజాగా సునీల్ కుమార్ ను పక్కకు తప్పించి ఎంఎస్ రాజు పేరును అధిష్టానం ప్రకటించింది. మడకశిర అభ్యర్థి మార్పుపై టీడీపీ అసమ్మతి నేతలు భగ్గుమన్నారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశాడంటూ చంద్రబాబు, లోకేశ్ ప్లెక్సీలను పార్టీ కార్యకర్తలు తగలబెట్టారు. ఎమ్మెస్ రాజు గో బ్యాక్.. లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దు అంటూ నినాదాలు చేశారు. మోసకారి చంద్రబాబు అంటూ పార్టీ జెండాలను, ప్లెక్సీలను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు.