ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన.. కీలక సూచన చేసిన సీపీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి పయనమవుతున్న నేపథ్యంలో సీపీఎం పార్టీ కీలక సూచన చేసింది.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన.. కీలక సూచన చేసిన సీపీఎం

chandrababu naidu delhi visit

Chandrababu Naidu Delhi Visit : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈరోజు సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బసచేసి బుధవారం పలువురు కేంద్ర పెద్దలతో భేటీ అవుతారు. రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి హస్తిన బాట పట్టడంతో సీఎం చంద్రబాబు పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు రేపు భేటీ కానున్నారు. విభజన సమస్యల పరిష్కారం, ఇతర రాజకీయ అంశాలు చర్చించే అవకాశముందని సమాచారం.

వాటిపై క్లారిటీ తీసుకోండి..
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఆంధ్రప్రదేశ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు స్పందించారు. ఢిల్లీ రెండోసారి వెళుతున్న చంద్రబాబు.. విభజన హామీలు, విశాఖ ఉక్కు, ప్రత్యేకహోదా అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ తీసుకోవాలని సూచించారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ స్మార్ట్ మీటర్లు అన్నీ తీసేయాలని డిమాండ్ చేశారు.

రైతులకు ఉచిత బీమా కల్పించాలి
రైతులకు ఉచిత ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. 2014-19 పంటల బీమా పథకం వల్ల రైతులకు న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. ఇందులో ప్రైవేటు కంపెనీలు 80 శాతం వాటా కలిగివున్నాయని, ప్రీమియం ఇచ్చేది ప్రభుత్వం.. తీసుకునేది ప్రైవేటు కంపెనీలని పేర్కొన్నారు. రైతుల‌ వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలని సూచించారు.

Also Read : ఏపీలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తామన్న సీఎం చంద్రబాబు.. భూకబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని వార్నింగ్

పేదలకు భూములు ఇవ్వాలి
గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చెల్లదని శ్రీనివాసరావు అన్నారు. అన్యాక్రాంతం అయిన భూములు వెనక్కి తీసుకుని పేదలకి ఇవ్వాలని, అదానీకి చట్ట విరుద్ధంగా కేటాయించిన భూములు కూడా అందులో ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్ళలో ఎస్ఈజెడ్ పేరిట తీసుకున్న భూములలో పరిశ్రమలు రాలేదని గుర్తు చేశారు. ఇన్వెస్టర్ కారిడార్, ఎస్ఈజెడ్ లకు ఇచ్చిన భూములు ఐదేళ్ళు పైబడినవి పేదలకు తిరిగివ్వాలని కోరారు.