Chandrababu Naidu: అందుకే గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును ఆపేసింది: అసెంబ్లీలో చంద్రబాబు
తొందరపాటు తగదని కేంద్ర సంస్థ చెప్పినా.. గత ప్రభుత్వం వినలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.

మూర్ఖత్వం, చేతకానితనం వల్లే గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2014-19 మధ్య తాము పడిన కష్టం అంతా వైసీపీ ప్రభుత్వం వల్ల నాశనమైందని తెలిపారు.
తొందరపాటు తగదని కేంద్రసంస్థ చెప్పినా.. గత ప్రభుత్వం వినలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరాన్ని సరిగ్గా పర్యవేక్షించకపోవడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, ఒక వ్యక్తి దుర్మార్గ ఆలోచనలు రాష్ట్రానికి శాపంగా మారాయని జగన్‌పై మండిపడ్డారు.
ఏపీకి గేమ్ చేంజర్, జీవనాడి పోలవరం అని చెప్పారు. నీటిని సమర్థంగా వినియోగించుకుంటే కరువును తరిమేయొచ్చని అన్నారు. అమరావతి, పోలవరం ఏపీకి రెండు కళ్లలా అభివర్ణించామని తెలిపారు. సీ పోర్టుపైనా ప్రత్యేక శ్రద్ధ చూపించామని చెప్పారు. వైఎస్సార్ హయాంలో పోలవరాన్ని అస్తవ్యస్తం చేశారని అన్నారు. తెలంగాణ ఏడు మండలాలను ఏపీలో కలుపుకునేలా సంప్రదింపులు జరిపామని తెలిపారు.
గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రాష్ట్రానికి రూ.వేలకోట్లు నష్టమని చంద్రబాబు నాయుడు విమర్శించారు. గత వైసీపీ సర్కారు కేవలం 3.08 శాతమే పోలవరం పనులు చేసిందని, గత ఇరిగేషన్ మంత్రికి టీఎంసీకి, క్యూసెక్కులకు తేడా తెలియదని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో ఎక్కడ చూసినా టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులే కనపడుతున్నాయని చెప్పారు.