Chandrababu : భారీ బందోబస్తు నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబు.. విక్టరీ సింబల్ చూపిస్తూ ముందుకు
టోల్ గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. జాతీయ రహదారిపై లైట్లను ఆర్పివేశారు అధికారులు. Chandrababu Jail

Chandrababu Jail
Chandrababu Jail : టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆయనను విజయవాడ నుంచి రాజమండ్రికి తరలిస్తున్నారు. ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. లా అండ్ ఆర్డర్ కు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై భారీగా పోలీసులు మోహరించారు. టోల్ గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. జాతీయ రహదారిపై లైట్లను ఆర్పివేశారు అధికారులు.
ఏసీబీ కోర్టు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. కారులో నిలబడి కార్యకర్తలకు విక్టరీ సింబల్ చూపించారు. చంద్రబాబు వెంటన ఆయన కొడుకు లోకేశ్ కూడా రాజమండ్రికి వెళ్తున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారు.
స్కిల్ స్కామ్ లో చంద్రబాబును నిన్న(సెప్టెంబర్ 9) నంద్యాలలో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. మధ్యాహ్నానికి వాదనలు పూర్తికాగా, న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ లో ఉంచారు. ఆదివారం (సెప్టెంబర్ 10) రాత్రి 7 గంటల ప్రాంతంలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు తీర్పు చదివి వినిపించారు. చంద్రబాబుకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంద్రబాబు సహా టీడీపీ శ్రేణులు షాక్ కి గురయ్యారు.