అక్రమ అరెస్ట్‌లకు మూల్యం చెల్లించుకోక తప్పదు, చంద్రబాబు వార్నింగ్

chandrababu warns jagan on atchannaidu arrest: పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. లోకల్ వార్ అరెస్టుల పర్వానికి దారి తీసింది. ఏకంగా ఏపీ టీడీపీ చీఫ్, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు నిమ్మాడలో అరెస్ట్ చేశారు. వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు రాగా, కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో నిన్న(ఫిబ్రవరి 1,2021) కేసు నమోదైంది. నేడు(ఫిబ్రవరి 2,2021) అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
కాగా, ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అచ్చెన్నను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, అచ్చెన్నపై పెట్టిన తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ హింసాకాండపై ప్రశ్నించడమే అచ్చెన్న చేసిన తప్పా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అచ్చెన్న ఇంటిపైకి కత్తులు, రాడ్లతో దాడికి వచ్చిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు పెట్టకుండా అచ్చెన్నపై పెడతారా? అని మండిపడ్డారు. అచ్చెన్న అరెస్ట్ జగన్ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించింది ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై పగబట్టి హింస, విధ్వంసాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారరు. ఉత్తరాంధ్రలో గత 40 ఏళ్లలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. రామతీర్థం ఘటనలో తనపైనా, అచ్చెన్న, కళా వెంకట్రావు, కూన రవికుమార్, వెలగపూడి సహా పలువురిపై కేసు పెట్టారని అన్నారు. సబ్బం హరి ఇల్లు, గీతం వర్సిటీ భవనాలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. అచ్చెన్నను గతంలో 83 రోజులపాటు అక్రమంగా నిర్బంధించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్ట్‌లకు జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన ఆరోపణలపై అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిని అచ్చెన్నాయుడు బెదిరించారంటూ నిన్న(ఫిబ్రవరి 1,2021) శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో మంగళవారం(ఫిబ్రవరి 2,2021) ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన టీడీపీ కార్యకర్తలు నిమ్మాడలో ఆందోళనకు దిగారు. అరెస్ట్ తో అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఉద్రిక్తత సాగుతోంది. వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. నిమ్మాడ నుంచి వైసీపీ తరఫున కింజరాపు అప్పన్న సర్పంచ్‌గా బరిలో దిగారు. అప్పన్న.. అచ్చెన్నాయుడు అన్న కుమారుడు. అప్పన్నను నామినేషన్ వేయొద్దని అచ్చెన్నాయుడు ఫోన్ చేసి బెదిరించినట్లు వైసీపీ ఆరోపిస్తోంది.