Chiranjeevi Fans: జాగ్రత్త.. మరోసారి నోరు జారితే.. బాలకృష్ణకు చిరంజీవి అభిమానుల వార్నింగ్
కూటమిలో ఉన్నామనే మేము సంయమనం పాటిస్తున్నాం. బాలకృష్ణ జాగ్రత్తగా ఉండాలి.

Chiranjeevi Fans: అసెంబ్లీ సమావేశాల్లో మెగాస్టార్ చిరంజీవి గురించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాలయ్యపై చిరంజీవి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భవాని రవికుమార్ తీవ్రంగా స్పందించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవిని మేము దైవంగా భావిస్తామన్నారు.
అలాంటి వ్యక్తి గురించి ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సమర్ధనీయం కాదన్నారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకూడదని మేము కోరుకుంటున్నామన్నారు. చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
”అనంతపురం జిల్లా తరపున మేము ఒకటే చెబుతున్నాం. గతంలో కూడా చిరంజీవి గురించి మీరు నోరు జారారు. మా అన్నయ్య చిరంజీవి చెప్పారు కాబట్టి మేము సంయమనం పాటిస్తున్నాము. ఇంకోసారి ఎప్పుడైనా మా చిరంజీవి గురించి కానీ మెగా ఫ్యామిలీ గురించి కానీ మీరు అవాకులు చెవాకులు పేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయో చెప్పలేము.
మేము ఎక్కడ ఏ రకంగా మీపై అటాక్ ఇస్తామనేది చెప్పలేము. మీరు సత్యసాయి జిల్లాలోనే ఉంటారు. మిమ్మల్ని ఇంతగా అభిమానిస్తున్నాము అంటే కూటమిలో ఉన్నామనే మేము సంయమనం పాటిస్తున్నాం. బాలకృష్ణ జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి మాటలు రిపీట్ చేస్తే బాలకృష్ణను అడ్డుకుంటాం. కూటమి పార్టీలో ఉన్నాం కాబట్టి ఓర్పుగా ఉన్నాం. లేకపోతే వేరేగా ఉండేది” అని చిరంజీవి ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా, అసెంబ్లీ సమావేశాల్లో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. చిరంజీవి గురించి మాట్లాడుతూ బాలయ్య వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో చిరంజీవి కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బాలయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. నాడు జగన్ చిరంజీవిని అవమానించారు అని బాలయ్య చెప్పగా.. అందుకు విరుద్ధంగా.. జగన్ తనను అసాదరంగా ఆహ్వానించారని చిరంజీవి చెప్పడం విశేషం.