తొవ్వేకొద్దీ ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి: అసెంబ్లీలో చంద్రబాబు
అధికార యంత్రాంగం మొత్తాన్ని నిర్వీర్యం చేశారని చంద్రబాబు నాయుడు విమర్శించారు.

గత వైసీపీ సర్కారు అక్రమాలపై తవ్వేకొద్దీ ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఏ రాజకీయ నాయకుడూ ఇన్ని తప్పులు చేయరని, గత సర్కారు హయాంలో వ్యవస్థలు విధ్వంసమయ్యాయని తెలిపారు.
అధికార యంత్రాంగం మొత్తాన్ని నిర్వీర్యం చేశారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్ర అప్పులు పరాకాష్ఠకు చేరాయని, అసత్య ప్రచారాన్నే ఆధారంగా చేసుకుని పనిచేశారని చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలను మభ్యపెట్టాలని చూశారని అన్నారు. ఇలాంటి పరిస్థితిని తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడలేదని తెలిపారు.
ఎన్నికల్లో ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదిగే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుందని అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ పిలుపునిచ్చారని, ఏపీ స్వర్ణాంధ్ర 2047 నినాదంతో ముందుకెళ్లాలని చెప్పారు.