Srisailam Dam: శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..
ప్రస్తుతం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ కు లక్ష 71వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.

Srisailam Dam: ఏపీ సీఎం చంద్రబాబు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర జలహారతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా 880 అడుగులకు నీరు చేరింది. దీంతో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా డ్యామ్ గేట్లను ఎత్తే అవకాశం ఉంది. దీంతో అక్కడ జలహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు.
ప్రస్తుతం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ కు లక్ష 71వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో 54వేల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు.
ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు శ్రీభమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్ట్ దగ్గర జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేయనున్నారు. మధ్యాహ్నం 1గంట 30 నిమిషాలకు శ్రీశైలం నుంచి సచివాలయానికి చేరుకోనున్నారు.