నేనున్నా భయపడకండి.. తెల్లవారుజామున 4గంటల వరకు విజయవాడ రోడ్లపై చంద్రబాబు సుడిగాలి పర్యటన..

ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి సోమవారం తెల్లవారు జామున 4గంటల వరకు చంద్రబాబు నాయుడు నిర్విరామంగా విజయవాడ నగర వీధుల్లో వరదనీటిలోనే పర్యటించారు.

నేనున్నా భయపడకండి.. తెల్లవారుజామున 4గంటల వరకు విజయవాడ రోడ్లపై చంద్రబాబు సుడిగాలి పర్యటన..

CM Chandrababu Naidu

CM Chandrababu Naidu : భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైంది. విజయవాడలోని అనేక ప్రాంతాలు, కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. సీఎం చంద్రబాబు, అధికారులు వరదనీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా.. వరదలోనే తమ ఇళ్లలో ఉన్నవారికి తాగునీరు, ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. చంద్రబాబు స్వయంగా అర్థరాత్రి సమయంలో బోటుపై సింగ్ నగర్ లో పర్యటించారు. అందరికీ ఆహారం అందిందా అంటూ అడిగి తెలుసుకున్నారు. కొందరికి ఆహారం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లను అందించారు. ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి సోమవారం తెల్లవారు జామున 4గంటల వరకు చంద్రబాబు నాయుడు నిర్విరామంగా విజయవాడ నగర వీధుల్లో వరదనీటిలోనే పర్యటించారు. భయపడకండి.. నేనున్నాను అంటూ వరద బాధితులకు భరోసాను కల్పించారు.

Also Read : విజయవాడ ముంపు ప్రాంతాల్లో బోటుపై సీఎం చంద్రబాబు పర్యటన.. ఆదుకుంటామని బాధితులకు హామీ

సోమవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో విజయవాడ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బస్సులో చంద్రబాబు విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు. రాత్రంతా అజిత్ సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. జూపూడి, మూలపాడులో ఇళ్లలోకి నీళ్ళు వచ్చి చేరడంతో స్థానిక ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అర్థరాత్రి సమయంలోకూడా బాధితుల వద్దకు చంద్రబాబు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. అందరికీ ఆహారం, నీళ్లు సరఫరా చేస్తున్నామని తెలిపారు. విపత్తును ధీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతీఒక్కరూ ధైర్యంగా ఉండాలని చంద్రబాబు కోరారు.

 

ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చంద్రబాబు సూచించారు. ఎవరూ అధైర్య పడొద్దు.. అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని వరద బాధితులను చంద్రబాబు కోరారు.