సీఎం జగన్ సంచలన నిర్ణయం : శాసనమండలి రద్దు..?
ఎలాగైనా మూడు రాజధానుల బిల్లుని ఆమోదింప చేసుకోవాలని పట్టుదలగా ఉన్న సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? శాసనమండలిని రద్దు చేయనున్నారా? ఇప్పుడీ

ఎలాగైనా మూడు రాజధానుల బిల్లుని ఆమోదింప చేసుకోవాలని పట్టుదలగా ఉన్న సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? శాసనమండలిని రద్దు చేయనున్నారా? ఇప్పుడీ
ఎలాగైనా మూడు రాజధానుల బిల్లుని ఆమోదింప చేసుకోవాలని పట్టుదలగా ఉన్న సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? శాసనమండలిని రద్దు చేయనున్నారా? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ శాసనమండలి రద్దు యోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు మండలిలో ఆమోదం పొందే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మండలిని టీడీపీ ఎమ్మెల్సీలు అడ్డుకోవడంతో సభలో బిల్లును పెట్టే అవకాశం లేకపోయింది. దీంతో సీఎం జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
పార్టీ నేతలతో మండలి రద్దు సాధ్యాసాధ్యాలు, లాభ నష్టాలపై జగన్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం(జనవరి 21,2020) సాయంత్రంలోపు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం అవసరమైతే అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మండలి రద్దు తీర్మానం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
మండలిలో ప్రస్తుతం టీడీపీకి మెజారిటీ ఉంది. ఆ పార్టీకి 28మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి కేవలం 9మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. ఛైర్మన్ కూడా టీడీపీకి చెందిన వ్యక్తే. దీంతో మండలిని రద్దు చేసే యోనచలో జగన్ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. కాగా, మండలి రద్దు అంత సులభం కాదని టీడీపీ నేతలు అంటున్నారు. రద్దు ప్ర్రక్రియకు కనీసం ఏడాది టైమ్ పడుతుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.
ఏపీ శాసనమండలి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పాలనా వికేంద్రీకరణపై చర్చకు ముందే నెంబర్ గేమ్ మొదలైంది. 58మంది సభ్యులున్న పెద్దల సభలో సంఖ్యాపరంగా ప్రతిపక్షానిదే(టీడీపీ) ఆధిపత్యం. టీడీపీకి 28మంది సభ్యులు ఉండగా… అధికార పక్షం వైసీపీకి కేవలం 9మంది సభ్యులే ఉన్నారు. ఇక.. బీజేపీకి ఇద్దరు సభ్యులుండగా… ముగ్గురు ఇండిపెండెంట్లు, 8మంది నామినేటెడ్ సభ్యులు, ఐదుగురు పీడీఎఫ్ ఎమ్మెల్సీలున్నారు. మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
టీడీపీకి 28మంది సభ్యులతోపాటు.. నామినేటెడ్ సభ్యుల్లోని ఐదుగురు ఎమ్మెల్సీలు, ఇండిపెండెంట్లలోని ఓ ఎమ్మెల్సీ టీడీపీకి మద్దతిస్తున్నారు. దీంతో మొత్తంగా ఆ పార్టీ బలం 34గా ఉంది. ఇక గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కంతేటి సత్యనారాయణరాజు వైసీపీలోనే ఉండటంతో ప్రభుత్వ బలం 10కి చేరింది. నామినేటెడ్ సభ్యుల్లో ఒకరు, ఇండిపెండెంట్లలోను ఇద్దరు సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం లేకపోలేదు. అయితే.. వీరంతా కలిపినా వైసీపీకి 14మంది సభ్యుల బలం మాత్రమే దక్కుతోంది. కానీ… బిల్లును గట్టెక్కించాలంటే అధికార పక్షానికి మరో ఆరుగురు ఎమ్మెల్సీలు అవసరం. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐదుగురున్నా వారికి పార్టీలతో సంబంధం లేదు. అందుకే వీరు తటస్థంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో బిల్లుల ఆమోదంపై అనుమానాలు నెలకొన్నాయి.
మండలిలో టీడీపీదే ఆధిపత్యమైనా…. డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేయడం, శమంతకమణి సభకు గైర్హాజరవడం వంటి పరిణామాలు ఆ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. మరోవైపు.. బిల్లుల ఓటింగ్ సమయానికి ఏం జరుగుతుందన్నది సస్పెన్స్‌గా మారింది.
ఏపీ శాసనమండలి సమావేశాలు తొలి రోజే(జనవరి 21,2020) హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. టీ విరామం తర్వాత సభ ప్రారంభమవగా… ప్రతిపక్షంతో ఢీకొట్టేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. మండలి ఛైర్మన్ తీరుపై మంత్రులు అభ్యంతరం వ్యక్తంచేశారు. రూల్ 71 కింద చర్చకు అనుమతివ్వడంపై అభ్యంతరం తెలిపారు. మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చించాలని మంత్రులు డిమాండ్ చేశారు. బిల్లులను అడ్డుకుంటే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు తప్పవని మంత్రి బుగ్గన అన్నారు.
మండలి ఛైర్మన్ ఇచ్చిన రూలింగ్ ను పునఃసమీక్షించాలని మంత్రులు పట్టుబడుతున్నారు. రూల్ 71 కింద చర్చకు అనుమతిత్వడం కొత్త సంప్రదాయానికి తెరతీయడమేనని అంటున్నారు. ఇలా వ్యవహరిస్తే ప్రభుత్వమే నడవదని మంత్రి బుగ్గన చెప్పగా… మంత్రుల తీరుతో సిగ్గుపడాల్సి వస్తోందని టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. షేమ్ షేమ్ అంటూ టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. దీంతో మండలి స్తంభించింది. రెండోసారి వాయిదా పడింది.
అంతకుముందు.. వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని అధికారపక్షం కోరింది. అయితే ప్రభుత్వ విధానాలపై చర్చించాలని రూల్ 71 కింద నోటీసులిచ్చిన టీడీపీ… బిల్లులు ప్రవేశపెట్టక ముందే చర్చించాలని పట్టుబట్టింది. దానికి మండలి ఛైర్మన్ అనుమతివ్వడంతో అధికార, విపక్షం మధ్య వాడివేడి వాదనలు కొనసాగాయి.
మంత్రి బొత్స సత్యనారాయణ మండలిని కించపర్చేలా వ్యాఖ్యానించారన్న టీడీపీ సభ్యుడు యనమల…, ఆయన క్షమాపణ చెప్పాలని యనమల డిమాండ్ చేశారు. అంతేకాదు… బొత్సపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిస్తామని యనమల చెప్పగా… తమకు అభ్యంతరం లేదన్నారు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. ఆ తర్వాత సభకు టీ విరామం ప్రకటించారు ఛైర్మన్. అనంతరం సభ ప్రారంభమైనా మంత్రులు… ఛైర్మన్‌పై మండిపడటంతో మళ్లీ రచ్చ కొనసాగింది.
అయితే… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండలికి రావడం ఆసక్తి రేపింది. వీరిద్దరూ వీఐపీ గ్యాలరీలో కూర్చుని మండలి జరుగుతున్న తీరును పరిశీలించారు. మరోవైపు.. టీడీపీ సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్, శమంతకమణిలు మండలి సమావేశాలకు హాజరుకాలేదు. డొక్కా మాణిక్య వరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేసి కలకలం రేపారు.