రాష్ట్రానికి తండ్రిగా.. : అప్పుడే వాళ్లు ఎదుగుతారు

ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు.. నేను తండ్రిగా మీరు, నేను మన పిల్లలను ఇంగ్లీష్ మీడియానికి పంపిస్తే.. రానున్న రోజుల్లో పిల్లలు నైపుణ్యాలతో ఎదుగుతారని అన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పేదవాళ్లు మాత్రమే ఎందుకు తెలుగు మీడియంలో చదవాలని ప్రశ్నించారు జగన్. ఇంగ్లీష్ మీడియం నిర్ణయంతో 20ఏళ్లలో రాబోయే ప్రపంచానికి అనుగుణంగా పిల్లలు తయారవుతారని అన్నారు జగన్.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడమే కాదు.. విద్యా వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వైఎస్ జగన్ తెలిపారు. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధన ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. ఒక్కో ఏడాదికి ఒక్కో తరగతిని పెంచుకుంటూ పోతామని అన్నారు.
ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తున్నామని అన్నారు. ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు వస్తాయని, అయితే వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒకవైపు ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురావడంతో పాటు విద్యా వ్యవస్థలో మార్పుల కోసం నాలుగు కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.
అందులో భాగంగానే నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పుడు 25వేల ప్రభుత్వ పాఠశాలల ఫోటోలు తీసి వచ్చే మూడేళ్లలో వాటి రూపురేఖలను మార్చబోతున్నట్లు చెప్పారు.