కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగించాలి : సీఎం జగన్

కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. దుకాణాల ముందు భౌతికదూరం పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. శనివారం (మే 16, 2020) కరోనా కట్టడిపై సీఎం జగన్ రివ్యూ నిర్వహిస్తున్నారు. ఎలాంటి విధానాలు పాటించాలన్న దానిపై స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటో కాల్స్ సిద్ధం చేయాలని జగన్ ఆదేశించారు.
అలాగే బస్సుల్లో పాటించాల్సిన విధివిధానాలను తయారు చేయాలన్నారు. రెస్టారెంట్లు, మాల్స్ లలో క్రమంగా తిరిగి కార్యకలాపాలను మొదలయ్యేలా చూడాలని సూచించారు. వలస కూలీలపై ఉదారత చూపించాలన్నారు. కూలీలు ఎక్కడ కనిపించినా టికెట్ లేకుండా బస్సుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటించాలన్నారు. వలస కార్మికులకు ఉచితంగా భోజనాలు, మంచినీరు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 వేల 205 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో కరోనాతో 49 మంది మృతి చెందారు. 1353 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 803 మందికి చికిత్స కొనసాగుతుంది.
ఇవాళ నమోదైన కేసుల్లో గుంటూరు 9, నెల్లూరు 9, కర్నూలు 9 చిత్తూరు 8, కృష్ణా 7, విశాఖ, 4, కడప1, పశ్చిమగోదావరి 1 కేసు నమోదు అయింది. కర్నూలు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కర్నూలు ఇప్పటివరకు 608 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో 413, కృష్ణా జిల్లాలో 367 మంది కరోనా బారిన పడ్డారు.