తిరుమలకు సీఎం జగన్, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రేపు (సెప్టెంబర్ 23,2020) తిరుమల వెళ్లనున్నారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు రాత్రి శ్రీవారికి గరుడసేవ జరగనుంది. కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయంలోని కళ్యాణోత్సవం మండపంలోనే గరుడ సేవను నిర్వహించనున్నారు. రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తుండడంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది.
సాయంత్రం 5 గంటలకు తిరుమలకు చేరుకోనున్న సీఎం జగన్, సాయంత్రం 6.30 నిమిషాలకు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సెప్టెంబర్ 24న ఉదయం శ్రీవారి దర్శనాంతరం 7గంటలకు ఆలయం వెలుపల వున్న నాదనీరాజన మండపం దగ్గర జరగనున్న సుందరకాండ కార్యక్రమంలో కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి జగన్ పాల్గొననున్నారు. అలానే 8 గంటలకు కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.
కాగా, జగన్ డిక్లరేషన్ విషయంలో ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్స్ పెను దుమారానికి దారి తీశాయి. ఈ విషయం మీద బీజేపీ సహా అన్ని పార్టీల వాళ్లు తీవ్రంగా మండిపడుతున్నారు.