జగన్‌కు దగ్గరయ్యేందుకు సీఎం రమేశ్ పాట్లు! ఇందుకేనా?

  • Published By: sreehari ,Published On : December 25, 2019 / 10:02 AM IST
జగన్‌కు దగ్గరయ్యేందుకు సీఎం రమేశ్ పాట్లు! ఇందుకేనా?

కడప జిల్లాకు చెందిన ప్రస్తుత బీజేపీ నేత.. ఒకప్పటి టీడీపీ నాయకుడు సీఎం రమేశ్‌.. ఇప్పుడు జగన్‌కు దగ్గరయ్యేందుకు తెగ తాపత్రయ పడిపోతున్నారని జనాలు అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక.. ఆ పార్టీలో ఉంటే తన వ్యాపారాలకు ఇబ్బందులు ఎదురవ్వక తప్పదనే ఉద్దేశంతో బీజేపీ కండువా కప్పుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.

వ్యాపారస్తుడైన ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఢిల్లీలో లాబీయింగ్‌ నడిపించడంలో ఆయన దిట్టగా పేరు సంపాదించారు. ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీలో లేకపోతే ఇబ్బందులు తప్పవని గుర్తించారు. అందుకే వ్యాపారాలున్న మరో ముగ్గురు ప్రముఖ నేతలతో కలిసి బీజేపీ గూటికి చేరిపోయారు.

అంతా బాగానే ఉంది. ప్రస్తుతం కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీలో ఉన్న సీఎం రమేశ్‌.. సడన్‌గా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టిలో పడడానికి ఆరాటపడిపోతున్నారని టాక్‌ నడుస్తోంది. ఎలాగైనా సరే జగన్‌ కంటిలో పడటానికి నానా పాట్లు పడుతున్నారట.

కడప జిల్లాకు వచ్చినపుడు ఏకంగా హెలికాప్టర్ దగ్గరకే వెళ్లి బొకే ఇవ్వటమే కాకుండా శాలువా కప్పి నమస్కారం చేయడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. దీనిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఏళ్ల తరబడి జగన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చిన రమేశ్‌ ఇట్టా ఒక్కసారిగా ఎందుకు ఇన్ని అవస్థలు పడుతున్నారో తెలుసుకోవడానికి జనాలు మాంచి ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. 

అసలు కారణం ఇదేనా? :
అసలు విషయంలోకి వెళ్తే.. సీఎం రమేశ్‌ కాంట్రాక్టర్‌గా చాలా పనులు చేస్తుంటారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాయలసీమలోని ప్రతిష్టాత్మకమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో చాలా వరకూ రిత్విక్ ప్రాజెక్ట్స్ పేరుతో రమేశ్‌ కంపెనీ చేశాయంట.

గాలేరు-నగిరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ లాంటి అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపట్టిన ఆ కంపెనీ పనుల నాణ్యత అంతగా లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికే చాలా వరకూ వాటికి సంబంధించిన పేమెంట్స్‌ కూడా అయ్యాయి. కాకపోతే ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్‌ బిల్లులు పెద్ద మొత్తంలోనే ఉన్నాయంట. వాటిని విడుదల చేయించుకోవాలంటే జగన్‌ దగ్గర కొంచెం వినయంగా ఉంటే బావుంటుందని రమేశ్‌ డిసైడ్‌ అయ్యారంట. 

అంతే కాకుండా పనులు నాసిరకంగా చేపట్టారనే విమర్శలున్నాయి కదా జగన్ అధికారంలోకి రాగానే రమేశ్‌ కంపెనీపై విచారణ చేయిస్తున్నారు. దీంతో రమేశ్‌లో షివరింగ్‌ మొదలైందంట. ఆ విచారణల నుంచి తప్పించుకోవడానికే బీజేపీలోకి జంపైపోయారని అంటారు.

అయినా జగన్‌ మొండివాడు కాబట్టి.. ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలున్నాయని గ్రహించిన రమేశ్‌.. ఇప్పుడు జగన్‌ను వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారట. ఈ మధ్యే జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఆశ్చర్యపరచిన రమేశ్‌.. ఇప్పుడు హెలికాప్టర్‌ దగ్గరకు వెళ్లి శాలువా కప్పి మరీ నమస్కారం చేయడం ఇప్పుడు అందరిలో చర్చనీయాంశం అయ్యింది. 

జగన్ ఏం చేస్తారో :
ఢిల్లీ పరిణామాలు కూడా దీనికి కారణం అంటున్నారు. ఎంపీ సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై ఈడీ, సీబీఐలతో విచారణ జరిపించాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెప్టెంబర్ 26న రాసిన లేఖ పట్ల రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ స్పందించారు. అక్కడ నుంచి ఆ లేఖ కేంద్ర హోం శాఖకు వెళ్లింది. రాష్ట్రపతి కార్యాలయం నోట్‌తో వచ్చిన లేఖను కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శికి, కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శికి పంపింది.

తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరింది. దీంతో సుజనా చౌదరి అక్రమాలపై సంబంధిత శాఖలు విచారణకు సిద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రమేశ్‌ ఇలా జగన్‌ను కలవడం చర్చనీయాంశం అయ్యింది. మరి జగన్‌ ఈ విషయంలో ఏం చేస్తారా అని అందరూ వెయిట్‌ చేస్తున్నారట.