తోటి కోడళ్ల మధ్య గొడవ : రెండు గ్రామాల్లో ఫుల్ టెన్షన్

తోటి కోడళ్లు మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఒకరు ఇంటి సభ్యులకు చెప్పారు. అంతే..ఆగ్రహానికి గురై..ఆమె అన్న..గ్రామానికి చేరుకుని చెల్లెలితో గొడవ పడిన వారితో ఘర్షణకు దిగాడు. పక్క గ్రామం నుంచి వచ్చి..ఇక్కడ గొడవ చేస్తారా ? అంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలను ధ్వంసం చేయడంతో రెండు గ్రామాల్లో ఫుల్ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లా కేవిపల్లి మండలం నక్కలదిన్నె వడ్డిపల్లిలో ఇద్దరు తోడికోడళ్ల మధ్య గొడవ జరిగింది. కుటుంబ విషయమై తోడి కోడళ్లు నిర్మల, చామంతి మధ్య 2020, మే 23వ తేదీ శనివారం రాత్రి గొడవ జరిగింది. తనకు జరిగిన అవమానంపై నూతనకాల్వ గ్రామంలోని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది నిర్మల. చెల్లెలు నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిన 3 కార్లు, బైక్‌లపై వడ్డిపల్లికి చేరుకున్న నిర్మల అన్న… చెల్లెలితో గొడవ పడ్డ వారితో ఘర్షణకు ప్రయత్నించాడు.
ప్రక్క గ్రామం నుంచి వచ్చి తమ గ్రామంపై దౌర్జన్యానికి యత్నిస్తున్నారని భావించిన వడ్డిపల్లి గ్రామస్తులు.. రాళ్లు, కర్రలతో కార్లు, బైక్‌లపై దాడి చేశారు. ఈ దాడిలో మూడు కార్లు, మూడు బైక్‌లు ధ్వంసం అయ్యాయి. ఇరువర్గాలను అదుపులోకి తీసుకొన్న పోలీసులు విచారిస్తున్నారు.