ఏపీలో NTR వైద్యం ఆగిపోయింది

  • Published By: veegamteam ,Published On : January 2, 2019 / 06:06 AM IST
ఏపీలో NTR వైద్యం ఆగిపోయింది

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఆగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచే వైద్య సేవలను ప్రైవేట్ ఆస్పత్రులు నిలిపివేశాయి. బిల్లులు చెల్లించకపోవడంతో వైద్య సేవలు అందించలేమంటున్నారు ఆస్పత్రుల యాజమాన్యాలు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం, ఉద్యోగుల హెల్త్ స్కీమ్, జర్నలిస్టు హెల్త్ స్కీమ్ సేవలను నిలిపివేశారు. అత్యవసర కేసులు, ఇప్పటికే అడ్మిట్ అయిన వారికే సేవలను కొనసాగించనున్నారు. 

రాష్ట్రంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద పేదలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు.  ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్టును ఏర్పాటు చేసి ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా అందిస్తోంది. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు 421 ఆస్పత్రులు ఈ పథకం కింద వైద్య సేవలను అందిస్తున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేయడంతో రోగులు అందోళన చెందుతున్నారు. ఎంతో మంది వైద్య సేవలకు దూరం కానున్నారు.