AP Weather Update : ఏపీలో భిన్నమైన వాతావరణం.. ఓ వైపు వడగళ్లు.. మరోపక్క వడగాడ్పులు
AP Weather Update : ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన వాతావరణం నెలకొని ఉంది. ఓవైపు వడగళ్ల వాన పడుతుండగా.. మరోవైపు వడగాడ్పులతో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
Contrasting weather conditions in andhra pradesh hailstorms on one side heatwave strikes other part of state
- ఏపీలో విచిత్రమైన వాతావరణం
- కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన
- మరికొన్ని చోట్ల వడగాడ్పులు
AP Weather Update : మార్చి నెల ఆరంభం నుంచే ఎండల తీవ్రత విపరీతంగా ఉండటంతో, ఈసారి వేసవి మరింత భయంకరంగా ఉంటుందని భావించిన జనాలకు వాతావరణం ఊహించని షాకిచ్చింది. ఒకవైపు వానలు దంచి కొడుతుంటే, మరోవైపు భానుడు భగభగ మండిపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఈ భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు వడగళ్ల వానలు, మరోవైపు వడగాడ్పులు.. ఈ రెండు కలిసి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు కీలక ప్రకటన చేస్తూ ప్రజలకు అలర్ట్ జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఈ ఆకస్మిక వర్షాలకు కారణం.. రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటమే. దీనివల్ల సముద్రం నుంచి తేమ గాలులు భూమిపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా ఉంది. ఈ క్రమంలో వాతావరణంలో అనిశ్చితి ఏర్పడి ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి.
కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతుండగా, మరికొన్ని జిల్లాల్లో ఎండల ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ మరో కీలక ప్రకటన చేసింది. ఈ ఆవర్తనాల ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణాంధ్రలో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పోలవరం ప్రాంతం చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉంటుందని, ఈ ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. వడగళ్ల వాన నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, వడగాడ్పులను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.
