ఏపీ హైకోర్టులో కరోనా కేసులు..న్యాయస్థానం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కరోనా కేసులు వెలుగు చూడటంతో న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం అత్యవసర కేసులు మాత్రమే విచారణకు స్వీకరించనున్నట్లు తెలిపింది. వాటిని కూడా వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో విచారణ జరపాలని నిర్ణయించింది. న్యాయమూర్తులు తమ అధికారిక నివాసాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కేసుల విచారణలో పాల్గొంటారు.
అలాగే, న్యాయస్థానం ముందు దాఖలయ్యే వివిధ పిటిషన్లు సైతం ఈ-ఫైలింగ్ పద్ధతిలో మాత్రమే నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మెయిల్‌లో అటాచ్‌మెంట్లు స్వీకరించబోమని స్పష్టం చేసింది. తాజా మార్పులకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే.
మరోవైపు ఏపీలో 657 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15 వేలు దాటింది. ఏపీలో మొత్తం 15 వేల 252 మందికి వైరస్ సోకగా ప్రస్తుతం 8 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో వైరస్ దూకుడు కొనసాగించగా అనంతపురం జిల్లాలను వణికిస్తోంది.
ఏపీలో కొత్తగా 657 కేసులు నమోదు కాగా వీటిలో కేవలం అనంతపురం జిల్లాలో 118 మంది ఉన్నారు. కర్నూలులో 90, తూర్పుగోదావరి జిల్లాలో 80, గుంటూరులో 77 మందికి వైరస్ సోకింది. కడపలో 60, కృష్ణాలో 52 మంది వైరస్ బారిన పడ్డారు.