మరో కోయంబేడు ? గుంటూరు వెజిటెబుల్ మార్కెట్ లో కరోనా

గుంటూరు కూరగాయల మార్కెట్ మరో కోయంబేడులా మారుతోంది. ఇక్కడ పనిచేసే 26మందికి కరోనా సోకింది. వీరిలో గుంటూరు నగరమే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చేవారూ ఉన్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసులు వెలుగు చూడని ప్రాంతాల్లో సైతం కొత్తవి నమోదవుతున్నాయి. వారం క్రితం ఇద్దరు రిటైల్ వ్యాపారులు కరోనా బారిన పడ్డారు. వారి లింకుల ద్వారా హోల్‌సేల్ వ్యాపారులకు పరీక్షలు చేయించారు.
వారిలో కొందరికి వైరస్ సోకడంతో మొత్తం మార్కెట్‌లోని వ్యాపారులు, గుమస్తాలు, ముఠా కూలీలు 266మందికి పరీక్షలు నిర్వహించగా 26మందికి పాజిటివ్ వచ్చింది. అనుమానిత లక్షణాలు కనపడగానే మార్కెట్‌ను మూసివేయించారు. పాజిటివ్ వచ్చినవారి కుటుంబ సభ్యులు, సంబంధీకులు అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఏపీలో కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. మే మొదటి, రెండు వారాల్లో తక్కువ సంఖ్యలో నమోదైన కేసులు.. ఆ తర్వాత డబుల్ అయ్యాయి. 2020, జూన్ 02వ తేదీ మంగళవారం కొత్తగా 115 కేసులు నమోదయ్యాయి. వీటిలో 82మంది రాష్ట్రంలోని వారు ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 33మందికి కరోనా సోకింది. కొత్త వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,791కు చేరుకుందని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. మంగళవారం 40 మంది డిశ్చార్జ్ అవగా… ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 927గా ఉంది.
Read: ఏపీలో హోటల్స్, రెస్టారెంట్స్ ఓనర్స్ ఫుల్ ఖుష్..ఎందుకు ?