తూర్పుగోదావరి జిల్లాలో విషాదం, ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కరోనా బాధితుడు ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ ఆస్పత్రి నాలుగో అంతస్థు నుండి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు శ్రీనివాసరావు(40) రాజమండ్రిలోని తుమ్మలోవకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. జిల్లా కోర్టులో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల కరోనా రావడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. తర్వాత జీఎస్ఎల్ కొవిడ్ ఆస్పత్రిలో చేరాడు.
సూసైడ్ కి కారణం ఏంటి?
ఈ క్రమంలో బుధవారం(ఆగస్టు 19,2020) రాత్రి ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఆస్పత్రి నిర్లక్ష్యమే శ్రీనివాసరావు ఆత్మహత్యకు కారణం అని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లు భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కరోనా ప్రాణాంతకం కాదు:
కరోనా ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెబుతున్నారు. చికిత్స తీసుకుని మందులు వేసుకుంటే తగ్గిపోతుందని అంటున్నారు. కరోనా పై విజయం సాధించాలంటే ముందుగా కావాల్సింది మందులు కాదు మనోధైర్యమే. మనం ధైర్యంగా ఉంటే ఆ మహమ్మారి ఏమీ చెయ్యలేదని నిపుణులు అంటున్నారు. అయినా కొందరు బాధితులు లేని పోని భయాలతో, అనుమానాలతో, ఆందోళనలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కరోనా సోకితే ఇక బతకమేమో అనే దిగులుతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఏపీలో 3లక్షలు దాటిన కరోనా కేసులు:
కాగా, ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా గత రెండు రోజులుగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం(ఆగస్టు 19,2020) రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 57వేల 685 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9వేల 742 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 3లక్షల 16వేల 003కు చేరింది.
3వేలకు చేరువలో కరోనా మరణాలు:
కరోనా మరణాలు కూడా తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో ఏకంగా 86 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 2వేల 906కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 15 మంది, నెల్లూరులో 15 మంది, అనంతపురంలో 8 మంది, గుంటూరులో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, కడపలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
బుధవారం 8వేల 061 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 3లక్షల 16వేల 003 పాజిటివ్ కేసులకు గాను, 2లక్షల 26వేల 372 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 86వేల 725 మంది ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.