చికెన్ వ్యాపారికి కరోనా లక్షణాలు : భయపడుతున్న జనాలు

సార్ మేము ఆ వ్యాపారి దగ్గర చికెన్ తీసుకున్నాం..మాకు ఏమైనా కరోనా లక్షణాలు ఉన్నాయోమో చెక్ చేయండి అంటున్నారు గాజువాకలోని ఓ కాలనీ వాసులు. ఎందుకంటే చికెన్ అమ్మిన వ్యక్తికి కరోనా లక్షణాలు రావడమే కారణం. ఏపీలో కరోనా భయపెడుతోంది. రోజు రోజుకు కేసులు ఎక్కువవుతున్నాయి. గాజువాకలో ఉన్న చికెన్ వ్యాపారికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలడంతో కలకల ప్రారంభమైంది. ఈ ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. అతడి నమూనాలు సేకరించారు.
పశ్చిమాంబ కాలనీకి చెందిన చికెన్ విక్రయించే వ్యాపారి 2020, మార్చి 22వ తేదీన మస్కట్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. అక్కడి నుంచి విశాఖకు చేరుకున్నాడు. అక్కడ పరీక్షలు నిర్వహించారు. అనంతరం క్వారంటైన్ కు తరలించారు. పరీక్షలో నెగటివ్ వచ్చింది. 2020, ఏప్రిల్ 02వ తేదీన మరోసారి శాంపిల్స్ తీసుకున్నారు. 2020, ఏప్రిల్ 07వ తేదీ మంగళవారం పాజిటివ్ వచ్చింది.
వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. అతను ఉంటున్న ప్రాంతానికి చేరుకున్నారు. చికెన్ విక్రయిస్తున్నాడని అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని క్వారంటైన్ కు తరలించారు. ఈ విషయం స్థానికులకు తెలిసింది. దీంతో వారు భయపడిపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. క్వారంటైన్ నుంచి ఎలా బయటకు వచ్చాడని ప్రశ్నిస్తున్నారు. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని అధికారులు అంటున్నారు. అతని కుటుంబసభ్యులు, మరికొంతమంది నమూనాలు తీసుకున్నారు. ఆయన నివాసం వద్ద శానిటైజ్ చేశారు.