తాడిపత్రి ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ ఎన్నికలను రద్దు చేయాలి: సీపీఐ రామకృష్ణ

అమరావతి: ఆ పెద్దాయన కొన్ని విషయాలు కుండ బధ్దలు కొట్టినట్టు మాట్లాడతారు. హోదాలో పెద్దైనా చిన్నైనా తన మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అలాగ మాట్లాడి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనెవరో కాదు సీనియర్ టీడీపీ నాయకుడు జేసీ దివాకర రెడ్డి. నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేశామని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టాయి.
జెసి దివాకర్ రెడ్డి పైన ఎఫ్.ఐ.ఆర్. బుక్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బుధవారం ఏపీ సిఇవో గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు ఇంటివద్దే జెసి దివాకర్ రెడ్డి ఒప్పుకున్నందున తాడిపత్రి ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ ఎన్నికలను రద్దు చేసి రీ పోలింగ్ జరపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
జెసి దివాకర్ రెడ్డి వ్యాఖలకు సంబంధించిన వీడియో క్లిప్లింగ్స్, పేపర్ కటింగ్స్ ను సిఇవో ద్వివేది కి అందజేసినట్లు రామకృష‌్ణ తెలిపారు. వీటిని పరిశీలించిన ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి జెసి వ్యాఖ్యలను తీసుకవెడతామని హామీ ఇచ్చారని తెలిపారు. జెసి దివాకర్ రెడ్డిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేస్తామని కూడా హామీ ఇచ్చారన్నారు.
ఎన్నికల్లో వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఖర్చు చేసి ప్రజాస్వామ్యానికి పాతర వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జెసి వ్యాఖ్యలు ఎన్నిక కమీషన్ ను ఛాలెంజ్ చేసే విధంగా వున్నాయని అభిప్రాయపడ్డారు. మేడే వేడుకలకు ఎన్నికల కోడ్ అభ్యంతరం లేకుండా చూడమని సిఇవో ను కోరామని, అందుకు సిఇవో ద్వివేది అంగీకరించినట్లు రామకృష్ణ తెలిపారు.