రంజుగా సాగాయి : కోడి పందాలు @ రూ.1,200 కోట్లు

కోడి పందేల నిర్వహణకు అనుమతి లేదని కోర్టు చెప్పినా, సాంప్రదాయ క్రీడను వదిలేది లేదంటూ సంక్రాంతి పండగకి ఏపీ లో కోడి పందాలు జోరుగా నడిచాయి.సంక్రాంతి 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా.

  • Published By: chvmurthy ,Published On : January 18, 2019 / 05:20 AM IST
రంజుగా సాగాయి : కోడి పందాలు @ రూ.1,200 కోట్లు

Updated On : January 18, 2019 / 5:20 AM IST

కోడి పందేల నిర్వహణకు అనుమతి లేదని కోర్టు చెప్పినా, సాంప్రదాయ క్రీడను వదిలేది లేదంటూ సంక్రాంతి పండగకి ఏపీ లో కోడి పందాలు జోరుగా నడిచాయి.సంక్రాంతి 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా.

విజయవాడ: చట్టం అధికారం ఉన్నవారికి చుట్టంగా మారింది. సాంప్రదాయం ముసుగులో కోస్తా ప్రాంతంలో కోడి పందాలు యధేచ్చగా కొనసాగాయి. పండుగ 3 రోజులు సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం ప్రజా ప్రతినిధులే ధిక్కరించారు. కళ్ళముందు బహిరంగంగానే కొళ్ళకు కత్తులు కట్టి పందెలు నిర్వహించినా పోలీసులు మిన్నకుండిపోయారు. 
సంక్రాంతి పండగంటేనే కోడిపందేలు, పేకాట,అనే విధంగా కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో యథేచ్ఛగా బరి తెగించి బరులు ఎర్పాటు చేసి మరి పందేలు సాగాయి. దాదాపు రూ.12 వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. వందలాది జీవితాలు తలకిందులయ్యాయి. 3జిల్లాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. కోడిపందేల మాటున పేకాట, గుండాట, కోతాట, లోనా,బయటా వంటి ఆటలు యథేచ్ఛగా సాగాయి. దిగువ, మధ్యతరగతి వ్యక్తులేకాదు సంపన్నులూ కోలుకోలేని దెబ్బతిన్నారు. 
భోగి నాడు మొదలైన పందేలు, పేకాటలు సంక్రాంతి రోజు తారాస్థాయికి చేరాయి. కనుమ రోజు రాత్రి వరకూ పందేలు సాగుతూనే ఉన్నాయి. ఉన్నతస్థాయి వర్గాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు  పక్కకు తప్పుకోవడంతో జూదరులు బరితెగించారు. భారీగా బరులు ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు తేడా లేకుండా జూదాలు నిర్వహించారు. అక్కడే మద్యం దుకాణాలు, బెల్టు షాపులూ వెలిశాయి. రాత్రిళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జూదాలు కొనసాగించారు.  కోడి పందెం బరులు జాతరలను మరిపించాయి. జూదరులు కోడిపందేలు, పేకాటల్లో లక్షలు పోగొట్టుకుంటే గుండాట, కోతాటల్లో వేలకు వేలు చేతులు మారాయి.
ఒక్క కృష్ణాజిల్లాలోనే 230 బరులు ఏర్పాటయ్యయి. తొలుత పోలీసులు ఆంక్షలు విధించినా.. పందేల నిర్వాహకులు వాటిని పట్టించుకోలేదు. అక్కడక్కడ బరులు ధ్వంసం చేశామని, బైండోవర్‌ కేసులు నమోదు చేశామని పోలీసు శాఖ ప్రకటించుకున్నా…… జిల్లాలో సుమారు 230 బరుల్లో పందేలు జరిగాయంటే నిర్వాహకులు ఎంతగా రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చు.
ఈసారి రెవెన్యూ అధికారులతోపాటు ఎన్నికల వేళ కావడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా నిర్వాహకుల నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. కోడి పందేలు జరిగే ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్లు చూపించడానికి ఒక్కో బరి నుంచి నలుగురైదుగురిపై కేసులు కట్టేలా వారి పేర్లను నిర్వాహకులే ఇవ్వాలని పోలీసులు షరతులు విధించి మరి కేసులు కట్టినట్లు సమాచారం.  మరోవైపు మద్యం అమ్మకాలూ విచ్చలవిడిగా జరిగాయి. 
ఇది ఇలా ఉంటే తెలంగాణ నుంచి  వచ్చిన పందెపు రాయుళ్ళు భీమవరం, ఉండి, పాలకొల్లు, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో భారీగా ఏర్పాటు చేసిన బరులు వద్దకు విచ్చేశారు. చింతలపూడి మండలంలోని సీతానగరం,  చింతలపూడి , లింగపాలెం మండలంలోని ములగలంపాడు, కలరాయనగూడెం, కామవరపుకోట మండలంలో రావికంపాడు, జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో  భారీగా పందేలు జరిగాయి. వీటిలో తెలంగాణ నుంచి జూదరులు  పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు. 
ఇక ఉభయ గోదావరి జిల్లాల్లోని కామవరపుకోట,కొవ్వూరు. పోలవరం ,నరసాపురం,దెందులూరు  నియోజక వర్గాలతో పాటు ప్రతి గ్రామంలోనూ  ఏర్పాటు చేసిన కొడి పందాల బరులు వద్ద భారీ ఎత్తున  నగదు  చేతులు మారింది. గతకొన్నేళ్లుగా జరిగిన పందాల కంటే ఈ ఏడు  జరిగిన  కోడి పందాలలో  ఎక్కువ సంఖ్యలో డబ్బులు చేతులు మారినట్లు నిర్వాహాకులు తెలుపుతున్నారు.