సినిమా చెట్టు పునరుజ్జీవానికి ప్రయత్నం.. కుమారదేవం గ్రామంలో డైరెక్టర్ వంశీ

కొవ్వూరు సమీపంలోని కుమారదేవం గ్రామంలో గోదావరి గట్టుపై ఇటీవల కూలిపోయిన చెట్టును సినీ డైరెక్టర్ వంశీ గురువారం పరిశీలించారు.

సినిమా చెట్టు పునరుజ్జీవానికి ప్రయత్నం.. కుమారదేవం గ్రామంలో డైరెక్టర్ వంశీ

Cinema Tree: తూర్పుగోదావరి జిల్లా కుమారదేవం గ్రామంలో గోదావరి నది తీరాన రెండుగా చీలిపోయిన సినిమా చెట్టు పునరుజ్జీవానికి రాజమండ్రి రోటరీ క్లబ్ బృందం ముందుకొచ్చింది. చెట్టు వేరుకు రసాయనాలు పంపించి శాస్త్రీయ విధానంలో చెట్టు నిలబెట్టేందుకు నిపుణులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రణాళిక పూర్తి అవడానికి సుమారు 45 నుంచి 60 రోజులు సమయం పడుతుందని ఈ చెట్టును కచ్చితంగా బతికించి తీరుతామని రోటరీ క్లబ్ బృందం సభ్యులు తెలిపారు. రేపటి నుంచి చెట్టుకి సంబంధించిన పనులు పూర్తిస్థాయిలో చేపడతామన్నారు.

ఎంతో చరిత్ర కలిగిన సినిమా చెట్టుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న రోటరీ క్లబ్ సభ్యులను కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్ అభినందించారు. చెట్టు నిలబెట్టేందుకు కృషి చేస్తున్న ఈ బృందానికి ప్రభుత్వం తరఫున కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

కుమారదేవంలో డైరెక్టర్ వంశీ
కొవ్వూరు సమీపంలోని కుమారదేవం గ్రామంలో గోదావరి గట్టుపై ఇటీవల కూలిపోయిన చెట్టును సినీ డైరెక్టర్ వంశీ గురువారం పరిశీలించారు. 100 సంవత్సరాలు పైగా చరిత్ర కలిగిన తన సెంటిమెంట్ చెట్టు కూలిపోవడంపై ఆవేదన గురయ్యారు. తాను డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ ఈ చెట్టు ఉందంటూ స్థానికులతో జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కాగా, కూలిపోయిన చెట్టుకు మళ్లీ పూర్వవైభవం రావాలని కోరుకుంటూ స్థానికులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.