దిశ చట్టం:అసెంబ్లీలో ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది ఆ రాష్ట్ర సర్కారు. ఆడపిల్లల రక్షణను గురించి ఈ మేరకు దిశ చట్టం తీసుకుని వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో హోం మినస్టర్ సుచరిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. యాసిడ్ దాడులు, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడితే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వాటిని పరిష్కిరించాలనేది ఈ చట్టం ముఖ్యమైన ఉద్ధేశ్యం. కచ్చితమైన ఆధారాలు లభ్యమైతే 21 రోజుల్లోనే మరణ శిక్ష విధించేలా ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది.
తెలంగాణలో ఇటీవల చోటుచేసుకున్న ‘దిశ’ ఘటనపై తీవ్ర కలత చెందిన ఏపీ సీఎం జగన్ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చట్టాన్ని రూపొందించి నిర్ణయం తీసుకుని దానిని అసెంబ్లీలో ఆమోదించారు. ఈ సంధర్భంగా హోమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ‘ఏపీలో మహిళలందరికీ జగనన్న ఒక రక్ష.. ఎవరైనా మహిళలపై చేయి వేస్తే పడుతుంది కఠిన శిక్ష’ అనే విధంగా రాష్ట్రంలో చట్టాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు.
దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రస్తుతం ఎక్కడైనా కూడా ఆడవాళ్లకు సంబంధించిన దారుణమైన నేరాలు జరిగితే, నెలలు గడిచినా శిక్షలు పడట్లేదు. దీంతో నేరస్థులు నిర్భీతిగా బెయిల్ పై బయటకు వచ్చి సమాజంలో తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నేరం చేసినవారిపై కేసులు నమోదైన 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్షపడేలా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడమే కాకుండా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ చట్టం ప్రకారం మహిళలు, చిన్నారులపై క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష తప్పదు.
దిశ చట్టం ప్రకారం ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో పొందుపరిచారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడినా, సోషల్ మీడియాలో, ఫోన్లలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా, ప్రవర్తించినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించే విధంగా 354(ఈ) సెక్షన్‌ను ఈ బిల్లులో పొందుపరిచారు. శిక్ష పడిన వారు బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అలాంటి నేరాలు చేస్తే నాలుగేళ్లు కఠిన శిక్ష పడుతుంది.
ఇక బాల బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారిపట్ల అఘాయిత్యాలకు పాల్పడేందుకు ట్రై చేస్తే ఈ చట్టంలోని 354 (ఎఫ్)తో పదేళ్ల నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉండనుంది. మహిళలకు ఆంధ్రప్రదేశ్ ఓ అభయాంధ్రప్రదేశ్‌గా ఉందని నిరూపించే విధంగా చట్టాలు తీసుకొచ్చినట్టు హోంమంత్రి సుచరిత తెలిపారు.