పట్టాల పండుగ.. ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ

Distribution of 30 lakh house sites: ఏపీలోని పేదలకు మరో పండుగను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇళ్లులేని పేదలకు ఇవాళ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనుంది. 30 లక్షల 75వేల మంది మహిళలకు ఇవి అందజేయనుంది. అంతేకాదు..15 లక్షలకుపైగా ఇళ్ల పనులు మొదలుపెట్టనుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. పేదల సొంతింటి కలను జగన్ ప్రభుత్వం సాకారం చేయనుంది.ఇవాళ మొదలయ్యే ఇళ్ల స్థలాలు, పట్టాల పంపిణీ పండుగ…15 రోజులపాటు సాగనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హయాంలో చేపట్టిన 2 లక్షల 52వేల టిడ్కో ఇళ్లకు ప్రభుత్వం సేల్ అగ్రిమెంట్లు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. పేదలకు 300 చదరపు అడుగుల ఇళ్లను ఒకే రూపాయికి అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. నవరత్నాల్లో భాగంగా దారిద్ర్య రేఖకు దిగువన నివనిస్తున్న నిరుపేదలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం.. ఇళ్ల పథకాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అర్హుడైన ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలని సంకల్పించారు జగన్. అందులో భాగంగానే ఇళ్ల పట్టాల పంపిణీకి శుక్రవారాన్ని ముహూర్తంగా ఖరారు చేసింది.
మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సీఎం జగన్…. పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలను అందించి…ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఉగాది పండగ రోజున ప్రారంభించాలని ప్రభుత్వం మొదట భావించింది. అయితే విపక్షం దీనిపై కోర్టుకు వెళ్లడంతో అది వాయిదా పడింది. ఆ తర్వాత అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని తలిచింది. అదికూడా వాయిదా పడడంతో… వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మే 30న పట్టాలు పంపిణీకి సిద్ధమయ్యింది. కోర్టు కేసులతో మరోసారి వాయిదా పడడంతో… వైఎస్ జయంతి రోజైన జులై 8, ఆ తర్వాత పంద్రాగస్టు, చివరికి గాంధీ జయంతిని కూడా ముహూర్తంగా నిర్ణయించారు. అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ కార్యక్రమం ఎట్టకేలకు రేపు నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇన్నాళ్లకు పేదల సొంతింటి కలను సాకారం చేయబోతోంది.
కోర్టు కేసులు ఉన్న ప్రాంతాలు మినహా.. మిగతా చోట్ల శుక్రవారం పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ మొదలు పెడుతోంది. ఆ తర్వాత 15 రోజులపాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాలు అర్హులైన పేదలకు అందజేస్తారు.ఏపీలో పేదలందరికీ ఇళ్ల పథకం కోసం… ఇప్పటి వరకు 30 లక్షల 75వేల 755 మంది లబ్దిదారులను ప్రభుత్వం గుర్తించింది. వీరిలో 23 లక్షల 37వేల 76 మందికి.. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసిన 17వేలకుపైగా వైఎస్‌ఆర్ జగనన్న కాలనీ లేఅవుట్లలో ఇంటి స్థలం ఇస్తారు. ఇప్పటికే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఉంటున్న 4 లక్షల 86వేల 820మందికి ఆ స్థలాలను క్రమబద్దీకరిస్తారు.
మిగిలిన 2 లక్షల 51వేల 868 మందికి ఏపీ టిడ్కో నిర్మించే ఇళ్లను కేటాయిస్తారు.అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి ఒక సెంటు స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది. 23,535 కోట్ల విలువైన 68,361.83 ఎకరాల భూమిని… నిరుపేదలకు ఇళ్ల స్థలాల రూపంలో ఇవ్వబోతోంది ప్రభుత్వం. ఇందులో ప్రభుత్వ భూమి 25, 120.33 ఎకరాలు ఉండగా.. 25,359.31 ఎకరాల భూమిని 10వేల 150 కోట్లతో కొనుగోలు చేసింది. ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనుండడంతో పేదల మోముల్లో సంతోషం వెల్లివిరిస్తోంది.