మూడు నెలలు అద్దె అడగొద్దు.. కలెక్టర్ ఆదేశాలు

  • Published By: vamsi ,Published On : April 19, 2020 / 05:03 AM IST
మూడు నెలలు అద్దె అడగొద్దు.. కలెక్టర్ ఆదేశాలు

Updated On : April 19, 2020 / 5:03 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అయితే కరోనా కేసులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదై ఏవైతే రెడ్‌జోన్‌లుగా ప్రకటించామో అక్కడ ఏ ఒక్క ఇంటి యజమాని మూడు నెలలపాటు అద్దె వసూలు చేయరాదంటూ కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. 

ఆ పరిధిలో ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారిపై విపత్తుల నిర్వహణ చట్టం కింద కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించిన కలెక్టర్.. రెడ్‌జోన్లలో నివాసం ఉంటున్న వారిని ఆదుకొనేందుకు జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే రూ.వెయ్యి నగదు సాయం కూడా ముందుగా రెడ్‌జోన్లలో నివాసం ఉంటున్న వారికే ఇస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

గుంటూరు జిల్లాలో ఇప్పటికే 126 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. గుంటూరు, తెనాలి, నరసరావుపేట, మాచర్లలో ట్రూనాట్‌ పరికరాల ద్వారా కరోన పరీక్షలు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. గుంటూరు జిల్లాలో రెడ్ జోన్‌లుగా గుంటూరు (పట్టణ), నరసరావుపేట, మాచర్ల (పట్టణ), అచ్చంపేట గ్రామీణ, మంగళగిరి (పట్టణ), పొన్నూరు (పట్టణ), చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి (పట్టణ) ఉన్నాయి.