దువ్వాడ వాణి రీఎంట్రీ… దువ్వాడ శ్రీను, మాధురికి షాక్..!
అగ్రెసివ్‌గా వెళ్లే దువ్వాడ వాణినే సరైన నాయకురాలని చర్చించుకుంటున్నారట టెక్కలి వైసీపీ క్యాడర్.

దువ్వాడ వాణి (Photo: Facebook)
శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ పాలిటిక్స్ మరోసారి ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మొన్నటి వరకు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి లవ్ స్టోరీ, దువ్వాడ ఫ్యామిలీ గొడవలతో టెక్కలి నియోజకవర్గం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి..పేరాడ తిలక్‌ను టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించింది వైసీపీ.
పార్టీ వేటు వేయడంతో సొంతంగానే ప్రజల్లో తిరుగుతామని ప్రకటించి..దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట గ్రామాల్లో కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే కొన్నిరోజులుగా దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి వైసీపీలో యాక్టీవ్ అయ్యారు. నియోజకవర్గంలో పార్టీ యాక్టివిటీలో పాల్గొంటున్నారు.
భర్త దువ్వాడ శ్రీనివాస్‌కు పొలిటికల్‌గా చెక్ పెట్టేందుకు వాణి సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. అందుకే ఆమె పార్టీ యాక్టివిటీని స్పీడప్ చేశారని అంటున్నారు.పార్టీ కార్యక్రమాలు, వైసీపీ శ్రేణులతో కలిసి బిజీబిజీగా మారారు వాణి. ఆమె ఎంట్రీతో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ప్రేమ జంట డైలమాలో పడిందట. డామిట్..కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా..వైసీపీ నుంచి దువ్వాడ శ్రీను సస్పెండ్ అవ్వడంతో..మిగిలిన కథను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మళ్ళీ తెరపై ప్రత్యక్షం అయ్యారు దువ్వాడ వాణి.
మొదట్లో టెక్కలి వైసీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్‌తో కలసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన ఆమె..ఇప్పుడు ఇండివిడ్యుయల్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గంలో కార్యకర్తల ఫంక్షన్లు, పరామర్శలలో గడచిన కొద్ది రోజులుగా చురుకుగా పాల్గొంటున్న దువ్వాడ వాణి..క్యాడర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వాణి రీఎంట్రీతో ఎక్కడ తమ ఇంచార్జ్ సీటుకు ఎసరు పెడతారోనన్న ఆందోళన మాత్రం పేరాడ తిలక్ వర్గీయులను వెంటాడుతోందట.
పొలిటికల్‌గా ఇద్దరూ సీనియర్లే
భార్యాభర్తలుగా, వైసీపీ లీడర్లుగా దువ్వాడ శ్రీనివాస్, వాణి రాజకీయం చేసిన నియోజకవర్గంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఉంది. పొలిటికల్‌గా ఇద్దరూ సీనియర్లే. ఇద్దరికీ రాజకీయ అనుభవం ఉంది. దువ్వాడ వాణి 2004లోనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గతంలో నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌గా పనిచేశారు. ఇప్పుడు టెక్కలి జెడ్పీటీసీగా ఉన్నారు. ఆమెకు రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా ఉంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ నుంచే ఎదిగారు.
జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం అక్కడ నుంచి వైసీపీలో చేరి నాలుగుసార్లు ఓడిపోయారు. శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి కూడా ఓటమి చెందారు. అయినా వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా, ఫైటర్‌గా పేరు తెచ్చుకున్నారు. అందుకే జగన్ ఆయనను ప్రోత్సహించారు. నాలుగైదుసార్లు ఓడినా ఎమ్మెల్సీ సీటు ఇచ్చి దువ్వాడ శ్రీనును చట్టసభకు పంపించారు. అయితే ఫ్యామిలీ ఇష్యూస్ రచ్చకెక్కడంతో కొద్ది నెలల క్రితం దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
మరోవైపు వైసీపీలో కీలక నాయకురాలిగా దువ్వాడ వాణికి పార్టీలో సముచితమైన గౌరవం దక్కుతోంది. ఆమె పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వైసీపీ మనిషిగానే ఉంటున్నారు. పార్టీ తరఫున టెక్కలిలో క్రియాశీలకంగానే పని చేస్తున్నారు. అవకాశం అదృష్టం కలిసి వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారట దువ్వాడ వాణి. ఇక లేటెస్ట్‌గా టెక్కలి నియోజకవర్గ స్థాయి వైసీపీ సమావేశంలో కూడా వాణి కనిపించారు.
పార్టీ వేదిక మీద పెద్దలతో ఆమె కూడా ఉన్నారు. దాంతో ఆమె వైసీపీలో కొనసాగుతున్నారని అందుకు పార్టీ పెద్దల ప్రోత్సహం కూడా ఉందని అంటున్నారు. పార్టీ నేతల్లో కూడా వాణిపై సాఫ్ట్ కార్నర్ ఉందంటున్నారు. అచ్చెన్నాయుడును రాజకీయంగా ఢీకొట్టేందుకు సాఫ్ట్‌గా ఉండే పేరాడ తిలక్ కంటే..అగ్రెసివ్‌గా వెళ్లే దువ్వాడ వాణినే సరైన నాయకురాలని చర్చించుకుంటున్నారట టెక్కలి వైసీపీ క్యాడర్. దువ్వాడ మోసం చేశారన్న సింపతీ కూడా వాణికి కలిసి వస్తుందని భావిస్తున్నారట. రాబోయే రోజుల్లో టెక్కలి రాజకీయాల్లో దువ్వాడ వాణి రోల్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.