అమ్మాయిల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాల కేసు..! పోలీసుల కీలక ప్రకటన

హాస్టల్ వాష్ రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశాం. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్ రూముల్లో తనిఖీలు చేశాం.

అమ్మాయిల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాల కేసు..! పోలీసుల కీలక ప్రకటన

Gudlavalleru Engineering College Hidden Cameras Incident (Photo Credit : Google)

Updated On : September 5, 2024 / 7:39 PM IST

Gudlavalleru Engineering College Hidden Cameras Incident : గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్స్ లో హిడెన్ కెమెరాల ఆరోపణల కేసు ఏపీలో తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి పోలీసు బృందాల దర్యాప్తుపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మీడియాకు కీలక వివరాలు తెలియజేశారు. కాలేజీలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఆయన స్పష్టం చేశారు. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీ టీం (CERT) సేవలు వినియోగించామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశామన్నారు. కాలేజీ వ్యవహారంపై ముగ్గురు ఐజీలు దర్యాప్తు చేశారని అశోక్ కుమార్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా పోలీసుల విచారణ జరిగిందన్నారు.

హాస్టల్ వాష్ రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశాం. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్ రూముల్లో తనిఖీలు చేశాం. వాష్ రూమ్స్ లోని షవర్లలో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించాం. విచారణలో కెమెరాలు కానీ, ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరు చెప్పలేదు. కెమెరాల ఏర్పాటు, వీడియోలు అంశం ఎవరో చెప్తేనే తమకు తెలిసిందని విచారణలో అందరూ చెప్పారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లను స్వాధీనం చేసుకున్నాం. ఏపీలో క్రిమినల్ కేసుల్లో తొలిసారిగా CERT సేవలు వినియోగించాం. వారు అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న 14 ఫోన్లు, 6 ల్యాప్ ట్యాప్ లు, ఒక ట్యాబ్ ను CERT బృంద సభ్యులకు అప్పగించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేశాం.

విద్యార్థులు ఎవరూ భయపడనవసరం లేదు. నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు లభ్యం కాలేదు. ఢిల్లీ సంస్థ CERT టెక్నికల్ విచారణ జరుగుతోంది. మరో మూడు రోజుల్లో ఆ నివేదిక కూడా వస్తుంది. ఈ ఘటనపై ఎటువంటి ఆధారాలున్నా పోలీసుల దృష్టికి తేవచ్చు. విద్యార్థుల భద్రతపై కాలేజీ యాజమాన్యానికి పలు సూచనలు చేశాం” అని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు.