విజయవాడ వరదలు… సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు

గతంలోనూ వరదలు వచ్చాయని, ఇప్పుడు పడిన వర్షం కన్నా ఎక్కువ వర్షమే పడిందని, అయితే ఏ రోజు కూడా మనుషులు చనిపోయే పరిస్థితి రాలేదన్నారు.

విజయవాడ వరదలు… సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు

Ys Jagan On Vijayawada Floods : విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ వరదలు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం సరిగా స్పందించకపోవడమే ఈ దారుణమైన పరిస్థితికి కారణం అన్నారు జగన్.

గతంలోనూ వరదలు వచ్చాయని, ఇప్పుడు పడిన వర్షం కన్నా ఎక్కువ వర్షమే పడిందని, అయితే ఏ రోజు కూడా మనుషులు చనిపోయే పరిస్థితి రాలేదన్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏ రోజూ లేవన్నారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే (ఆగస్టు 28వ తేదీనే) హెచ్చరించినా, సమాచారం ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్ మండిపడ్డారు. వరదలపై ప్రజలను అప్రమత్తం చేయడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.

”సింగ్ నగర్ లో దయనీయ పరిస్థితులు ఉన్నాయి. కనీసం తినడానికి తిండి కూడా లేదు. చాలీచాలని బోట్లు ఉన్నాయి. రిలీఫ్ క్యాంప్ లు కూడా లేవు. ఒక్కరికి కూడా పైసా సాయం అందలేదు. ఇలాంటి దారుణమైన మేనేజ్ మెంట్ చరిత్రలో ఏ సీఎం చేసి ఉండడు. వరదలపై ప్రజలను అప్రత్తం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదు. ఒక ప్రణాళికబద్దంగా కార్యక్రమం చేయాలి. డ్యామ్ లలో నీళ్లను తగ్గించే ప్రయత్నం ఏదీ చేయలేదు.

గత నెల 30వ తేదీ నుంచి డ్యామ్ లలో నీళ్లు తగ్గించుకుంటూ వచ్చి ఉంటే పరిస్థితులు ఇంత దారుణంగా, వరద ఇంత భీకరంగా ఉండేది కాదు. కానీ, చంద్రబాబు సర్కార్ చాలా జాప్యం చేసింది. చంద్రబాబు ప్రజలను పట్టించుకోవడం మర్చిపోయారు. రెడ్ బుక్ తో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపులపై మాత్రమే ధ్యాస పెడుతున్నారు తప్ప గవర్నెన్స్ మీద, ఏం చేయాలి అన్నదానిపై దృష్టి పెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే వరదలు ఇంత భీకరంగా మారాయి” అని చంద్రబాబు సర్కార్ పై ధ్వజమెత్తారు జగన్.

 

Also Read : విజయవాడ ముంపునకు ప్రధాన కారణం ఏంటి? ఈ పాపం ఎవరిది?