Perni Nani : ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడలేదు? ప్రజాగళం సభపై పేర్ని నాని ఫైర్
చంద్రబాబుతో సభలో పాల్గొనేటప్పుడు జాగ్రత్త. వెనుక నుంచి వెన్నుపోటు పొడవకుండా చూసుకోండి

Perni Nani
Perni Nani : టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నిర్వహించిన ప్రజాగళం సభపై వైసీపీ నేత పేర్నినాని ఫైర్ అయ్యారు. మూడు పార్టీల సభ అట్టర్ ఫ్లాప్ అని ఆయన కామెంట్ చేశారు. మూడు పార్టీల ఉమ్మడి సభ జనం లేక వెలవెలబోయిందన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఎందుకు కలిశాయో చెప్పాలని పేర్నినాని ప్రశ్నించారు. ప్రధాని మోదీని బతిమిలాడి మరీ చంద్రబాబు పొత్తు కుదుర్చుకున్నారని ఆయన అన్నారు. లోపాయికారి ఒప్పందాలు ఎందుకోసం? ఎవరి కోసం? అని నిలదీశారు. దేశ ప్రధానే మైకు ముందు పావు గంట సేపు నిలుచున్నారన్న పేర్నినాని.. సభను జరుపుకోవడమే మీకు చేతకాదు అని విమర్శించారు. ఇది దేశ ప్రధానిని అవమానపరిచినట్లే అని అన్నారు.
అమరావతి, పోలవరం అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు.. ఇదేనా మీ నిబద్దత అని ప్రధాని మోదీని ప్రశ్నించారు పేర్నినాని. మీ ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా? ఇవ్వరా? అని ఎందుకు చెప్పలేదని పేర్నినాని అడిగారు. మూడు పార్టీల సభలో పోలవరం ప్రస్తావనే లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ను ఉంచుతారా? లేక అమ్ముతారా? ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు. వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మోదీ అంటున్నారు.. ఎవరైనా నమ్ముతారా? అని అన్నారు.
మోదీ పక్కనున్న వాళ్లంతా గజదొంగలు. చంద్రబాబు కోసం పని చేసే వాళ్లు మీ పక్కనున్నారు. ఆలయాలను ధ్వంసం చేసిన వారి పక్కన మోదీ కూర్చోవడం ఏంటి? విభజన హామీలనే పట్టించుకోని మోదీ కొత్త హామీలిస్తారా? పగలు మోదీ, చీకట్లో రాహుల్ తో చేతులు కలిపే వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ కు భారత రత్న ఎందుకు ఇవ్వలేదు? గతంలో మోదీని చంద్రబాబు తిట్టారు. ఇప్పుడదే చంద్రబాబు.. మోదీని పొగిడారు. చంద్రబాబులో ఈ మార్పునకు కారణం ఏంటి? ఈ పొత్తులు, ఒప్పందాలు రాష్ట్రానికి అవసరం లేదు. గతంలో చంద్రబాబుకు ఓటు వేయొద్దని ఎన్టీఆర్ చెప్పారు.
అయోధ్యలో రామ మందిరంలో బాల రాముడిని ప్రతిష్టించిన మోదీ.. గుడులు కూల్చిన బాబుతో ఎలా వేదిక పంచుకుంటారు? ఇదేనా మోదీ హైందవం? చంద్రబాబుకు ఓటేయ్యొద్దని ఎన్టీఆర్, తమ్ముడు రామ్మూర్తి నాయుడు చెప్పారు. చంద్రబాబుకు ఓటేయొద్దని హరికృష్ణ కూడా చెప్పారు. చంద్రబాబుకు ఓటేయొద్దని ఆయన బంధువులే చెప్పారు. చిలకలూరి పేట సభలో ముగ్గురూ త్యేక హోదాపై ఎందుకు మాట్లాడలేదు? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన బాబును పక్కన కూర్చోపెట్టుకుని ఎన్టీఆర్‌ను పొగిడితే ఎలా మోదీ గారు?
ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చంద్రబాబు కమిటీ. ఈ కమిటీలో రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరి, షర్మిల అందరూ ఉంటారు. మోదీగారు.. మీరు చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబుతో సభలో పాల్గొనేటప్పుడు జాగ్రత్త. వెనక నుంచి వెన్నుపోటు పొడవకుండా చూసుకోండి” అని పేర్నినాని అన్నారు.
Also Read : ఏపీలో కూటమి ప్రభావం ఎంత? రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన భరోసా ఏంటి? ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ