టీటీడీ అటువంటి ఆలోచనలు దయచేసి విరమించుకోవాలి.. ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక కామెంట్స్

సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం గంటలోపు, మూడు గంటల్లోపు చేయించగలుగుతాం అన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. నాకు తెలిసినంతవరకు ...

టీటీడీ అటువంటి ఆలోచనలు దయచేసి విరమించుకోవాలి.. ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక కామెంట్స్

Updated On : August 3, 2025 / 1:29 PM IST

LV Subrahmanyam: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీటీడీ పాలక మండలికి కీలక సూచనలు చేశారు.

ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని టీటీడీ చైర్మన్‌ను కోరుతున్నానని అన్నారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం గంటలోపు, మూడు గంటల్లోపు చేయించగలుగుతాం అన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. నాకు తెలిసినంతవరకు అది అసంభవం. దాని గురించి ప్రయత్నం చేయడం క్షేమకరం కాదని పేర్కొన్నారు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించాలన్నా ఆలయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ ప్రయత్నాలు విరమించుకొని భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని సుబ్రహ్మణ్యం సూచించారు.

శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం వాడుతున్న విధానానికి మించి మరే రకమైన మార్పుచేసే అవకాశం లేదు. దాని గురించి ధనం వృథా చేయొద్దు. ప్రస్తుతం ఇస్తున్న దర్శన సమయం అందరికీ ఆమోదమే. గతంలో ఎందరో చైర్మన్లు, ఈవోలు ఇటువంటి ఆలోచనలు చేశారు. ఆ ప్రయత్నం విరమించుకోవాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. అయితే, సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై టీటీడీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతీరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఒక్కోసారి రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ సమయంలో స్వామివారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. అయితే, భక్తులకు సౌకర్యాల కల్పన, దర్శన విషయంలో ఇబ్బంది కలగకుండా టీటీడీ అనేక చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేలా చూడాలని భావిస్తోంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ (ఏఐ)ను ఉపయోగించాలని టీటీడీ నిర్ణయించింది. దీనికోసం తిరుమలలోని కంపార్టుమెంట్లు, లోపలికి వెళ్లే మార్గం, బయటకు వచ్చే దారుల మధ్య ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయాలని భావించింది.

ఏఐ వినియోగం ద్వారా అన్నిరకాల దర్శనాలు చేసుకునే భక్తుల సంఖ్యను లెక్కిస్తారు. ఈ విధానం వల్ల దర్శనానికి కచ్చితంగా ఎంత సమయం పడుతుందో గుర్తించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. తద్వారా తిరుమల వచ్చే భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం కల్పించేలా టీటీడీ దృష్టిపెట్టింది. అయితే, తిరుమలలో ఏఐ వినియోగంపై టీటీడీ కసరత్తు చేస్తున్న వేళ .. ఏఐ ఆధారిత దర్శనాలపై ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.