వలస కూలీల అవస్థలపై చలించిన సీఎం జగన్ :ఫ్రీ బస్సు సౌకర్యం

కరోనా వైరస్ కారణంగా..వలస కూలీలు పడుతున్న బాధలపై సీఎం జగన్ చలించి పోయారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ రాష్ట్రంలోకి ప్రవేశించి… రహదారుల మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నవలస కూలీల స్థితిగతులను తెలుసుకున్నారు సీఎం జగన్. మండుటెండలో పిల్లా, పాపలతో కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా నడుస్తున్న వలస కూలీల పరిస్ధితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. మానవీయ కోణాన్ని కూడా మర్చిపోవద్దని అధికారులకు సూచించారు. 2020, మే 16వ తేదీ కోవిడ్ – 19 నివారణ చర్యలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
ఏపీ రాష్ట్రం గుండా వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలని, వీరి కోసం బస్సులు తిప్పడానికి సిద్ధం కావాలన్నారు. ఇందుకోసం విధి, విధానాలు తయారు చేయాలని, వలస కూలీలకు టిక్కెట్టు కూడా అడగవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నడిచి వెళ్తున్న వలస కార్మికులు ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులు ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలన్నారు.
ఇదివరకు ఆదేశించిన విధంగా వారికి భోజనాలు, తాగు నీరు ఏర్పాటు చేయాలని, ప్రోటోకాల్స్ పాటిస్తూ నడిపే బస్సుల్లో వలస కూలీలకు 15 రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డితో పాటు పలువురు అధికారుల హాజరయ్యారు.
Read Here>> ప్రజారోగ్య రంగంలో సమూల మార్పులు… చారిత్రక ప్రణాళిక రూపొందించిన ఏపీ ప్రభుత్వం