తిరుపతి కల్తీ నెయ్యి ఇష్యూలో షాకింగ్.. అరెస్టులు, ఉత్కంఠ.. అన్ని వేళ్లు అటువైపే చూపుతున్నాయ్!
ఇదే గనుక జరిగితే శ్రీవారి లడ్డూ ఇష్యూ మరో నేషనల్ టాపిక్ అయ్యే చాన్సు ఉంది.

Ttd Laddu Row
చిన్నగా మొదలై.. పెద్ద ఇష్యూ అయి.. దేశాన్నే ఊపేసిన..శ్రీవారి లడ్డూ ఇష్యూ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలతో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక సిట్..దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసిన స్పెషల్ సిట్ అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టారు.
టీమ్‌లుగా ఏర్పడి ఎంక్వైరీ చేస్తున్న అధికారులు..నెయ్యి సప్లై చేసే డెయిరీస్‌లో తనిఖీలు చేసిన నలుగురిని అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్.. వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావ్దా, తమిళనాడులోని ఏఆర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్‌ను కల్తీ నెయ్యి కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలపై స్పెషల్ సిట్ విచారణలో పలు ఆసక్తికర అంశాలు గుర్తించిందట. లడ్డూ తయారీ కేంద్రం నుంచి నెయ్యి టెండర్లు, సరఫరా చేసిన సంస్థల వరకు సిట్ పలు కోణాల్లో విచారణ చేస్తోందట. పలువురిని విచారించి..రికార్డులను పరిశీలించిన తర్వాత నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాఫ్తు టీమ్..లడ్డూ ప్రసాదంలో వాడిన ఆవునెయ్యి కల్తీ అయినట్లు గుర్తించిందట. ఈ వ్యవహారంలో కొన్ని కంపెనీల ప్రమేయం ఉన్నట్లుగా ప్రైమరీ దర్యాప్తులో తేలిందంటున్నారు.
ఏఆర్ డెయిరీలోనూ విచారణ
నెయ్యిని సప్లై చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీలోనూ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో టీటీడీతో ఒప్పందం చేసుకున్న ఏఆర్ డెయిరీ పలు అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి ఎక్కువ మొత్తంలో నెయ్యిని సరఫరా చేయటానికి ఉత్తరాదికి చెందిన పలు డెయిరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేసినట్లుగా గుర్తించారట. తక్కువ ధరకు నెయ్యి సప్లైకి అంగీకరించటంతో పాటుగా టీటీడీ అధికారులు ఎవరైనా సహకారం అందించారా.. దీని వెనుక ఎవరి పాత్ర ఏంటి అనే కోణంలో విచారణ కొనసాగుతోందట.
తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు NDDB రిపోర్ట్‌లో బయటపడిన అంశంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి మరో అధికారి ప్రత్యేక బృందంలో నియమితులయ్యారు. ఈ స్పెషల్ సిట్ టీమ్ బృందాలుగా ఏర్పడి..ఇప్పటికే వైష్ణవి డెయిరీ, తమిళనాడులోని ఏఆర్ డెయిరీ, చెన్నైలోని ఎస్‌ఎంఎస్ ల్యాబ్‌ను పరిశీలించాయి.
టీటీడీకి కల్తీ నెయ్యి సప్లై చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డెయిరీ..తాము పంపిన నెయ్యి నాణ్యమైనదిగా చెప్తూ SMS ల్యాబ్ సర్టిఫికెట్‌ను సమర్పించడంతో సిట్ బృందం దానిపై దృష్టి పెట్టింది. ఏఆర్ డెయిరీ నెయ్యి నాణ్యతపై ఆ ల్యాబ్ ఇచ్చిన సర్టిఫికెట్ నిజమా.? కాదా.? నెయ్యి నాణ్యతను ఎలా సర్టిఫై చేశారు.? ల్యాబ్‌లో క్వాలిటీ చెకింగ్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారా.? లేదా.? అని ఆరా తీస్తున్నారట. పాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారనే దానిపై కూడా వివరాలు తెలుసుకున్నారట. ఏఆర్ డెయిరీ నెయ్యి నాణ్యతను పరీక్షించి, క్వాలిటీ సర్టిఫికెట్ ఇచ్చిన ఎక్స్‌పర్ట్స్ వివరాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీటీడీ అధికారుల్లోనూ.. పొలిటికల్‌గానూ చర్చ
స్పెషల్ సిట్ దర్యాప్తుతో మళ్లీ హడావుడి కనిపిస్తోంది. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న వివాదం కావడంతో ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు అటు టీటీడీ అధికారుల్లోనూ.. ఇటు పొలిటికల్‌గానూ చర్చనీయాంశం అవుతోంది. అదుపులోకి తీసుకున్న నలుగురిని A2 నుంచి A5గా చూపించారు. మరీ A1 ఎవరనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ఆ నలుగురు చెప్పిన విషయాలతో..ఈ కేసులో పెద్ద బ్రేక్ త్రూ లభించిందట. అందుకే A1 ఎవరో రిమాండ్ రిపోర్ట్‌లో మెన్షన్ చేయలేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత సర్కార్ హయాంలో టీటీడీలో కీలకంగా పనిచేసిన మాజీ అధికారి A1గా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే పాలక మండలి నిర్ణయాలకు కూడా లింకు పెడుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ కల్తీ నెయ్యి కేసు అధికారుల వరకే పరిమితం అవుతుందా..అప్పటి ప్రభుత్వ పెద్దల దాకా వ్యవహారం వెళ్తుందా అన్న చర్చ జరుగుతోంది. అదే గనుక జరిగితే శ్రీవారి లడ్డూ ఇష్యూ మరో నేషనల్ టాపిక్ అయ్యే చాన్సుంది. సిట్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్నది చూడాలి మరి.