ఏపీలో ఏటీఎం సెంటర్ల వద్ద ఫుల్ రష్..చాంతాడంత క్యూ, మిషన్లు ఖాళీ

ఏపీలో ఏటీఎం సెంటర్ల వద్ద ఫుల్ రష్..చాంతాడంత క్యూ, మిషన్లు ఖాళీ

Updated On : January 14, 2021 / 8:12 AM IST

Full rush at ATM centers in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం సెంటర్ల మీదకు ప్రజలు దండెత్తారు. డబ్బులు తీసుకొనేందుకు ఏటీఎం సెంటర్ల వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ఏ ఏటీఎం చూసినా..చాంతాడంత క్యూ కనిపించింది. నగదు పెట్టిన కాసేపటికే మిషన్లు ఖాళీ కావడంతో..నో క్యాష్ అనే బోర్డులు దర్శనమిచ్చాయి. అసలు ఏటీఎం సెంటర్ల వద్దకు ప్రజలు ఎందుకు పోటెత్తారు. నగదు రద్దు, ఇతరత్రా ఏ అనౌన్స్ మెంట్ ఏమి లేదు కదా…అయితే..ఇంతగా కిటకిటలాడటానికి కారణం..అమ్మ ఒడి డబ్బులు ఖాతాల్లోకి పడడమే కారణం.

పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళుతున్న సీఎం జగన్ ప్రభుత్వం..ఇటీవలే అమ్మ ఒడికి సంబంధించిన డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో వేసింది. దీంతో డబ్బులను డ్రా చేసుకొనేందుకు ఏటీఎం సెంటర్లకు వెళ్లారు. సోమవారం..చాలా మంది డబ్బులను డ్రా చేసుకుని వెళ్లారు. మంగళవారం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన వారికి భారీ క్యూ లైన్ దర్శనమిచ్చింది. ఒక్కో చోట కనీసం రెండు గంటల సమయం పట్టిందంటే..పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పండుగలు, ఇతరత్రా వేళల్లో సాధారణంగా ఏటీఎంల ముందు రద్దీ ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా ప్రతి ఏటీఎం మీద..వందల సంఖ్యలో తరలి రావడంతో..కరెన్సీ దొరకడం కష్టతరమైంది. అమ్మ ఒడితో సంబంధం లేకుండా..వ్యక్తిగతంగా డబ్బులు డ్రా చేసుకోవాలన్న వారికి కూడా ఇబ్బందులు తప్పలేదు. బ్యాంకులకు కూడా సెలవులు కావడంతో..క్యాష్ అవసరాలు ఉన్న వారు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.