Gossip Garage: కాంగ్రెస్ హైకమాండ్ కొత్త స్కెచ్.. ఈసారైనా ఏపీలో కాంగ్రెస్ పునర్ వైభవం సాధ్యమేనా?
షర్మిల మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆమెనే పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని ఫిక్స్ అవడం వెనుక కారణం లేకపోలేదు.

Gossip Garage: వరుసగా మూడు టర్మ్‌లు దారుణ ఓటమి. కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. అసలు వెంటిలేటర్ మీదున్న పార్టీని ఎవరు గట్టెక్కిస్తారా అని ఎదురుచూస్తున్న టైమ్‌లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చారు. ఏపీ పీసీసీ చీఫ్‌గా ఆమె కొనసాగుతున్నారు. అయితే షర్మిల పనితీరుపై పలువురు లీడర్లు అధిష్టానంకు ఫిర్యాదులు చేసి..ఆమెను తప్పించే ప్రయత్నం చేశారన్న చర్చ ఉంది. అయినా షర్మిలనే కంటిన్యూ చేస్తూ..సీనియర్స్‌ను స్యాటిస్‌ఫై చేస్తూ..కొత్త స్కెచ్ వేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఈసారి అయినా హస్తం పార్టీ ప్లాన్స్ వర్కౌట్ అయ్యేనా? నవ్యాంద్ర పొలిటికల్ ఫైట్‌లో కాంగ్రెస్ బలమెంత?
కాంగ్రెస్. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పార్టీ కేంద్రంలో అధికారంలోకి లేకే పదకొండేళ్లు అయిపోతుంది. ఏపీలో కూడా అదే సీన్ ఉంది. విభజన తర్వాత ఏపీలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ ఏపీలో వెంటిలేటర్ మీద ఉన్నట్లు కనిపిస్తోంది. ఎవరు ముందుండి నడిపిస్తారో..తిరిగి ప్రాణం పోస్తారో అని క్యాడర్, లీడర్లు..ఎదురుచూస్తున్న సమయంలో వైఎస్ షర్మిల..ఏపీ పీసీసీ చీఫ్‌గా తెరమీదకు వచ్చారు.
అయితే షర్మిల సెపరేట్ గ్రూప్ మెయింటెన్ చేస్తున్నారని..సీనియర్లను పట్టించుకోవడం లేదని..పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారు. పైగా ఆమె చంద్రబాబు డైరెక్షన్‌లో పని చేస్తున్నారన్న అలిగేషన్స్ కూడా చేశారు. ఈ క్రమంలో సీనియర్ నేతలు సీక్రెట్ సమావేశం పెట్టుకుని షర్మిలను తప్పించేలా పావులు కదిపారన్న ప్రచారం ఉంది. అధిష్టానం దగ్గరకు కూడా ఇదే ప్రతిపాదన తీసుకెళ్లగా కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం షర్మిలను తప్పించేందుకు నో చెప్పినట్లు టాక్.
ఏపీలో వైసీపీ వీక్ అయితేనే కాంగ్రెస్ బలపడుతుందని అధిష్టానం భావిస్తోందట. రెండు రీజనల్ పార్టీలు చాలా స్ట్రాంగ్ ఫోర్స్‌తో పోటీ పడుతున్నప్పుడు అధికారంలో లేని తమకు స్కోప్ ఉండదని అంచనా వేస్తున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిలను అధ్యక్షురాలిగా కొనసాగిస్తేనే..వైసీపీని ఢీకొనడంతో పాటు ఆ పార్టీపై బలంగా ఫైట్ చేయగలరని భావిస్తున్నారట. అందుకే షర్మిలనే పీసీసీ చీఫ్‌గా కంటిన్యూ చేస్తూ సీనియర్లను బుజ్జగించే ప్లాన్ వేసిందట హస్తం పార్టీ.
ఏపీ పీసీసీ కార్యవర్గంలో కొత్త వారికి పదువులు కట్టబెట్టింది హైకమాండ్. పీసీసీ చీఫ్ షర్మిల ప్రెసిడెంట్‌గా ఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇద్దరు సీనియర్లకు బాధ్యతలు ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీలను ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. దాంతో పాటు కాంగ్రెస్‌లోని మిగిలిన సీనియర్లను కలుపుకుంటూ ఏకంగా 25 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని వేశారు. ఈ కమిటీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది.
25 మంది సీనియర్ నేతలతో పొలిటికల్ అఫైర్స్ కమిటీకి ఛైర్మన్‌గా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ వ్యవహరించనున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రులు పళ్లంరాజు, చింతా మోహన్, జేడీ శీలం వంటి ప్రముఖులకు ఈ కమిటీలో సభ్యులుగా చోటు కల్పించారు. వీరితో పాటు కేవీపీ రామచంద్రరావు, కె.రాజు, మస్తాన్ వలీ, జీవీ హర్షకుమార్, ఎన్. తులసిరెడ్డి వంటి సీనియర్లను కూడా తీసుకున్నారు.
ఏపీలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలనే అమలు చేస్తోంది. షర్మిల మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆమెనే పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని ఫిక్స్ అవడం వెనుక కారణం లేకపోలేదు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి షిఫ్ట్ అయింది. జగన్‌ను వైఎస్సార్ వారసుడిగా భావించి వైసీపీ వైపు కాంగ్రెస్ ఓటర్లు, లీడర్లు టర్న్ అయిపోయారు. ఇప్పుడు వైసీపీ నుంచి తమ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు రావాలంటే..షర్మిలనే పీసీసీ చీఫ్‌గా ఉండాలన్నది కాంగ్రెస్ వ్యూహమట. ఇలా సెంటిమెంట్‌తోనే వైసీపీని దెబ్బ తీసే స్కెచ్ వేస్తూ..ఏపీలో కూటమిని ఎదుర్కోవడానికి సీనియర్లతో టీమ్‌ను ఏర్పాటు చేసి పార్టీ దూకుడు పెంచిందని అంటున్నారు.
ఏపీలో కాంగ్రెస్‌కు వరుస ఓటములు తప్పడం లేదు. మూడు ఎన్నికల్లోనూ డిపాజిట్లు దక్కలేదు. దాంతో ఈసారి ఛాన్స్ వదులుకోవద్దని ఎన్నికలకు నాలుగేళ్ళ ముందు నుంచే అన్నీ సిద్ధం చేసుకుంటున్నారట. ఉనికి పోరాటం నుంచి గత వైభవం దిశగా అడుగులు వేయాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశంగా కనిపిస్తోంది. షర్మిల జనంలోనే ఉండేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. ట్రయాంగిల్ ఫైట్ జరిగేలా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందట. వచ్చే ఎన్నికల్లోనైనా ఏపీలో అధికారంలోకి వస్తారో రారో పక్కన పెడితే..కచ్చితంగా చెప్పుకోదగ్గ సీట్లు గెలుచుకోవాలనేది కాంగ్రెస్ అధిష్టానం మనసులో మాట అంటున్నారు.
Also Read: ఎన్నిక ఏదైనా వైసీపీని వెంటాడుతున్న ఆ కేసు.. ఈసారి ఎంత డ్యామేజ్ చేస్తుందో అని టెన్షన్..!