Gossip Garage: జిందాల్‌ భూములపై రాజకీయ రచ్చ..! ఇంతకీ ఈ భూముల కథేంటి? పార్క్ ప్రతిపాదన ఎక్కడి నుంచి వచ్చింది?

ఎమ్మెల్సీకి చెక్‌ పెట్టే ప్రయత్నంలో ఎమ్మెల్యే చేసిన ప్లాన్ వికటించినట్లు అయింది. ఇలా రాజకీయ ఆధిపత్య పోరుతో జిందాల్ భూముల వ్యవహారం రచ్చకు దారితీసింది.

Gossip Garage: జిందాల్‌ భూములపై రాజకీయ రచ్చ..! ఇంతకీ ఈ భూముల కథేంటి? పార్క్ ప్రతిపాదన ఎక్కడి నుంచి వచ్చింది?

Updated On : July 6, 2025 / 12:35 AM IST

Gossip Garage: ఆ భూములపై ఉన్న పంచాయితీ ఇప్పటిది కాదు. ఏకంగా 15ఏళ్లుగా ఆ ల్యాండ్స్‌పై రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చిన జిందాల్‌ భూముల వ్యవహారం..పొలిటికల్ వార్‌కు దారితీస్తోంది. జిందాల్‌ భూముల్లో MSME పార్క్‌ రాబోతోందన్న ప్రచారంతో..గిరిజనులు, స్థానికులు రోడ్డెక్కారు. వారికి వైసీపీ ఎమ్మెల్సీ అండగా నిలిచారు. ఎమ్మెల్సీకి చెక్‌ పెట్టే ప్రయత్నంలో ఎమ్మెల్యే చేసిన ప్లాన్ వికటించినట్లు అయింది. ఇలా రాజకీయ ఆధిపత్య పోరుతో జిందాల్ భూముల వ్యవహారం రచ్చకు దారితీసింది. ఇంతకీ ఈ భూముల కథేంటి.? పార్క్ ప్రతిపాదన ఎక్కడి నుంచి వచ్చింది?

ఉత్తరాంధ్ర సెంట్రిక్‌గా జిందాల్ భూముల రచ్చ రాజకీయ వేడిని రాజేస్తోంది. ప్రత్యేకంగా విజయనగరం జిల్లాలో జిందాల్ ల్యాండ్స్‌ ఇష్యూ ..పొలిటికల్ రప్చర్‌కు దారితీసింది. జిందాల్ భూముల్లో MSME పార్కులు ఏర్పాటు చేస్తారనే ప్రచారం గందరగోళానికి తెరలేపింది. జిందాల్ భూములున్న ఎస్.కోట నియోజకవర్గంలో ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి ఆజ్యం పోయగా, అది కాస్త చినికి చినికి గాలి వానలా మారి జిల్లాకు వ్యాపించింది.

జిందాల్ భూముల వ్యవహారం ఈనాటిది కాదు. 2007-2008లో ఎస్.కోట మండలం బొడ్డవర ప్రాంతంలో జిందాల్ కంపెనీ…అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు కోసం భారీగా భూసేకరణ చేసింది. దాదాపు 1165 ఎకరాలు సేకరించగా, అందులో 188 ఎకరాలు జిరాయితీ కాగా, మిగిలినవి గిరిజన్లకిచ్చిన అస్సైన్డ్ భూములు. అయితే జిందాల్ అల్యూమినియం పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు బాక్సైట్ గనులకు అప్పటి కేంద్రం ప్రభుత్వం నిరాకరించడంతో పరిశ్రమ ఏర్పాటు ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి నేటి వరకు ఆ భూములు జిందాల్ కంపెనీ చేతిలో ఖాళీగానే ఉన్నాయి.

ఈ భూముల్లో MSME పార్కులు ఏర్పాటు చేసేలా గత వైసీపీ ప్రభుత్వం 2022లో ఒక జీవో జారీ చేసింది. అప్పట్లో కూడా స్థానికులు ఈ జీవోను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపట్టారు. గడువులోగా జిందాల్ కంపెనీ పెట్ట లేదు కాబట్టి, ఆ భూములను తిరిగి గిరిజనులకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఇంతలో ప్రభుత్వం మారిపోవడంతో..గత ప్రభుత్వ ప్రతిపాదనపై నేటి వరకు ఎలాంటి ఇష్యూ తెరపైకి రాలేదు. అయితే పది రోజుల కింద జిందాల్ భూముల్లో జేసీబీలతో చదను చేసే పనులు మొదలవ్వడంతో..ఒక్కసారిగా ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గిరిజనులు, స్థానికులు మళ్లీ రోడెక్కారు. స్థానిక వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు గిరిజనులకు అండగా నిలిచారు.

ఎమ్మెల్సీ రఘురాజుకు చెక్ పెట్టేందుకు ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగా ఉండే ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, అదే నియోజకవర్గానికి చెందిన డీసీఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణలు ఒక్కటయ్యారు. ఇద్దరికి గిట్టకపోయినా అధిష్టానం ఒత్తిడితో కలవక తప్పలేదట. ఎమ్మెల్యే, డీసీఎంఎస్ ఛైర్మన్‌ ఇద్దరూ ఆందోళన చేస్తున్న గిరిజనుల దగ్గరకు వెళ్లి, సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, రెండు రోజులు గడువు కావాలని కోరారు.

Also Read: శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య వివాదం.. అధిష్టానం సీరియస్..!

అయితే జిందాల్ భూ సమస్యపై వారికి ఎలాంటి అవగాహన ఉందో తెలియదు గాని, ఈ విషయంలో కాస్తంత అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే, జిందాల్ భూముల పరిహారానికి సంబంధించి 15 మంది నిర్వాసితులకు తప్ప మిగిలిన వారందరికీ అప్పట్లోనే ప్రభుత్వం పరిహారం చెల్లించిందని, ఇప్పుడు ఎలాంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డా. బిఆర్.అంబేడ్కర్‌ ప్రకటించారు. అక్కడితో ఆగని ఎమ్మెల్యే, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌..జిందాల్ భూముల్లో MSMEపార్కులు పెడతామని, పరిశ్రమల స్థాపనకు సహకరించాలని కూడా కోరి వివాదం మరింత ముదిరేలా చేశారు.

MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ వివాదంపై క్లారిటీ ఇవ్వడం మరో సంచలనానికి దారి తీసింది. జిందాల్ భూముల్లో MSME పార్క్ ఏర్పాటు పై ప్రభుత్వంలో ఎలాంటి చర్చ లేదని, అలాంటి ప్రతిపాదన కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను తెరపైకి తెచ్చి రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడితూ ఈ రాజకీయ గందరగోళానికి ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నం చేశారు.

అయితే ఎస్.కోట నియోజకవర్గంలో లీడర్ల మధ్య ఆధిపత్య పోరే..ఈ వివాదానికి దారితీసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవైపు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, మరోవైపు డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మధ్యలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు..వీరికి కంటిలో నలుసులా మారారన్న చర్చ ఉంది.

వాస్తవానికి ఎమ్మెల్సీ రఘురాజు వైసీపీలో ఉన్నా, భార్య సుధారాణి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ప్రసుతం ఎమ్మెల్సీ రఘురాజు అటు వైసీపీకి దూరంగా ఉండలేక, ఇటు టీడీపీకి దగ్గర కాలేకపోతున్నారు. ఈ ముగ్గురు నేతల మధ్య కొనసాగుతోన్న రాజకీయ పోరు కారణంగానే జిందాల్ భూముల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుందన్న ప్రచారం జరుగుతుంది. అయితే మంత్రి కొండపల్లి ఇచ్చిన ప్రకటనతో..ఈ వివాదానికి తెర పడుతుందా..లేక నేతలు మరో రచ్చకు దారితీస్తారా అన్నది చూడాలి.