రసవత్తరంగా ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ రాజకీయాలు.. ఏసీఏ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న టీడీపీ కీలక నేతలు..!

ఏసీఏకి ఆయన నాయకత్వం ఉంటే... రాష్ట్రంలో క్రికెట్‌ స్టేడియంలు, మెగా టోర్నీలు నిర్వహించే అవకాశాలు దక్కించుకోడానికి ఈజీ అవుతుందని... ఆ విధంగా రాష్ట్రం బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగే వీలుందని చెబుతున్నారు.

రసవత్తరంగా ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ రాజకీయాలు.. ఏసీఏ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న టీడీపీ కీలక నేతలు..!

Andhra Cricket Association : ఆంధ్రా క్రికెట్‌ అసోషియేషన్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ నేతల చేతుల్లో ఉన్న అసోసియేషన్‌ను టీడీపీ నేతలు తమ ఖాతాలో వేసుకునే పని ప్రారంభించారు. ప్రస్తుతానికి అపెక్స్‌ కౌన్సిల్‌తో రాజీనామా చేయించారు. వచ్చే నెలలో అసోసియేషన్‌కు ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియను టీడీపీకి చెందిన కీలక నేతలే చక్కబెట్టడంతో ఇకపై ఏసీఏలో కూటమి ప్రభావం కనిపించే అవకాశాలు ఎక్కువగా కనిపించనున్నాయంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితోపాటు టీడీపీ, బీజేపీకి చెందిన పలువురు నేతలు ఏసీఏ పీఠంపై కన్నేయడంతో ఈ నెల రోజుల్లో క్రికెట్‌ పాలిటిక్స్‌లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఎక్కువవుతోంది….

ఏసీఏలో పాగా వేసేలా విజయసాయిరెడ్డి బంధువుల పావులు..
ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ రాజకీయాలు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. రాజకీయాలతో సంబంధం లేని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ను గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు వైసీపీ నేతల నుంచి ఏసీఏని రక్షించాలనే ప్రతిపాదనతో రంగంలోకి దిగిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాజీ మంత్రి సుజయ కృష్ణరంగారావు ఏసీఏని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని టాక్‌ వినిపిస్తోంది. గతంలో విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించిన ఏసీఏని వైసీపీ హయాంలో విశాఖకు తరలించారు. దీని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా కేటాయించకపోయినా, క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ పరంగా ఏసీఏలోకి రాజకీయాలు ప్రవేశించాయనే ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలతో పాటు 31 పట్టణాల్లో క్రికెట్‌ క్లబ్బులు ఉన్నాయి. ఈ క్లబ్బులు, జిల్లా కమిటీల నుంచి ఎన్నికైన ప్రతినిధులు రాష్ట్ర స్థాయిలో అసోసియేషన్‌ కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. గతంలో పారిశ్రామిక వేత్త గోకరాజు గంగరాజు, మాజీ క్రికెటర్‌ చాముండేశ్వర్‌నాథ్‌ వంటి వారు ఏసీఏకి ప్రాతినిధ్యం వహించారు. ఐతే గత ప్రభుత్వంలో క్రికెట్‌ అసోసియేషన్‌కు ఉన్న పాపులారిటీతో వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బంధువులు… ఏసీఏలో పాగా వేసేలా పావులు కదిపారు.

ఏసీఏ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న కేశినేని చిన్ని..!
ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఉన్న ఏసీఏకి ఆయన సోదరుడు శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక వైసీపీతో సత్సంబంధాలు ఉన్న ఇతరులు మిగిలిన పదవుల్లో నియమితులయ్యారు. వీరంతా టీడీపీ అధికారంలోకి రాగానే తమ పదవులను వదులుకోడానికి సిద్ధమయ్యారు. దీంతో టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని రంగంలోకి దిగి అసోసియేషన్‌ను ప్రక్షాళించాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడైన కేశినేని చిన్ని… ఏసీఏ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఎంపీగా ఉండటంతో అధ్యక్ష పదవికి ఏమైనా అడ్డంకులు వస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక టీడీపీ, బీజేపీ నుంచి పలువురు నేతలు పేర్లు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి.

ఏసీఏ పీఠం కోసం ఎదురుచూస్తున్న జేసీ పవన్ రెడ్డి..
ప్రస్తుతం ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ రాజీనామాతో త్రిసభ్య కమిటీని తాత్కాలికంగా నియమించారు. ఇందులో టీడీపీ నేత, మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన జేసీ పవన్‌రెడ్డి సైతం ఏసీఏ పీఠం కోసం ఎదురుచూస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీచేసిన పవన్‌రెడ్డికి… ఈసారి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయనకు ఏసీఏ చైర్మన్‌గా ఎన్నికయ్యేలా సహకరిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఐతే జిల్లా అసోసియేషన్ లు అన్నీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నినే కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నుంచి అసోసియేషన్‌ వ్యవహారాలన్నీ చూస్తున్న ఎంపీ చిన్ని… అధ్యక్షుడిగా ఎన్నికైతే రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని ఆశిస్తున్నారు.

చిన్ని అధ్యక్షుడైతే జై షా సహకారం కూడా లభించవచ్చనే అంచనా..
బీసీసీఐ పర్యవేక్షణలో ఉండే ఏసీఏకి ఎంపీ చిన్ని నాయకత్వం ఉంటే… రాష్ట్రంలో క్రికెట్‌ స్టేడియంలు, మెగా టోర్నీలు నిర్వహించే అవకాశాలు దక్కించుకోడానికి ఈజీ అవుతుందని… ఆ విధంగా రాష్ట్రం బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగే వీలుందని చెబుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కుమారుడు జై షా… బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నారు. చిన్ని అధ్యక్షుడైతే జై షా సహకారం కూడా లభించవచ్చనే అంచనా వేస్తున్నారు. కేంద్రంలో టీడీపీకి పలుకుబడి ఉండటంతో… టీడీపీ నేతల నాయకత్వాన్ని క్రికెట్‌ అసోసియేషన్లు కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నిక అవడం లాంఛనమే అంటున్నారు. ఒకవేళ ఏదైనా అభ్యంతరాలు వ్యక్తమైతే… ఆయన సూచించిన వారే ఏసీఏ పగ్గాలు చేపట్టే చాన్స్‌ ఉందంటున్నారు. మొత్తానికి వైసీపీ ఖాళీ చేసిన అసోసియేషన్‌లో ఇకపై టీడీపీ మార్కు కనిపించనున్నదనేది స్పష్టమవుతోందంటున్నారు.

Also Read : ఆ ఒక్కడి కోసం స్పెషల్‌ ఆపరేషన్, నీడలా వెంటాడుతున్న పోలీసులు.. అసలు వల్లభనేని వంశీ ఎక్కడ?