Gossip Garage : ఒకరు మాజీ మంత్రి, మరొకరు సీనియర్ మంత్రికి స్వయాన మేనల్లుడు.. భీమిలి వైసీపీ ఇంఛార్జ్ పోస్టు ఎవరికి?
మరి ఈ ఇద్దరిలో ఎవరిని వద్దన్నా.. అసంతృప్త స్వరాలు వినిపించేలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్నది ఉత్కంఠగా మారింది.

Gossip Garage : భీమిలి భీముడు ఎవరు..? వైసీపీలో ఇంట్రెస్టింగ్‌గా వినిపిస్తున్న డిబేట్ ఇది.. అవంతి ఎగ్జిట్‌తో ఖాళీ అయిన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పోస్ట్‌పై ఇద్దరు నేతలు కన్నేశారు.. ఒకరేమో మాజీ మంత్రి, మరొకరేమో సీనియర్ మోస్ట్ మంత్రికి స్వయానా మేనల్లుడు.. మరి ఆ ఇద్దరిలో అధిష్టానం బాధ్యతలు అప్పగించేదెవరికి? బుజ్జగించేది ఎవరిని?
భీమిలిపై ఇప్పుడు ఇద్దరు నేతల కన్ను..
వైసీపీని వలసలు వేధిస్తున్నాయి. మొన్నటి వరకు పార్టీకి బలంగా ఉన్న నేతలు కూడా చెట్టుకొకరు, పుట్టకొకరు ఐపోతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఇప్పుడు వర్గపోరు కూడా తోడైంది. ఇది చాలదన్నట్టు ఖాళీ అయిన నియోజకవర్గంలో ఇన్‌చార్జ్ పోస్ట్ కోసం ఆశావహులు కన్నేస్తున్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామాతో ఖాళీ అయిన భీమిలిపై ఇప్పుడు ఇద్దరు నేతల కన్ను పడింది.
వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఇంతవరకు పలానా నియోజకవర్గం ఫిక్స్ అంటూ ఏమీ లేదు. దీంతో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. నియోజకవర్గం వెతుక్కోవాల్సిన దుస్థితి వస్తోంది. 2014-అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయనకు ఇప్పుడు ఏ నియోజకర్గంలో యాక్టివ్‌గా ఉండాలో తోచడం లేదు. పొలిటికల్ చౌరస్తాలో నిలబడి దిక్కులు చేస్తున్నారు. ఇంతలో ఆయనకు ఊహించని లక్కీ చాన్స్ ఎదురైంది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో భీమిలి వైసీపీ సీటు ఖాళీ అయ్యింది.. దీంతో అమర్‌నాథ్ కన్ను భీమిలీపై పడిందని వైసీపీ వర్గాల ఇన్నర్ టాక్. అంతేకాదు భీమిలి ప్రజలతో టచ్‌లోకి వెళ్లడం, జిల్లా రాజకీయాలను ఫుల్‌గా స్టడీ చేయడం కూడా మొదలుపెట్టారంట అమర్‌నాథ్..
భీమిలి నుంచి కొంతకాలంగా కాపు లీడర్లదే గెలుపు..
గుడివాడ అమర్‌నాథ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. భీమిలీలో కాపుల ఓటు బ్యాంక్‌కు కొదవే లేదు. ఇది తనకు బాగా కలిసొస్తుందని అమర్‌నాథ్ లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీలను పక్కన పెడితే.. భీమిలి నుంచి కొంతకాలంగా కాపు లీడర్లే గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు కావచ్చు.. అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి శ్రీనివాస్, అంతకుముందు కర్రి సీతారామ్.. ఇలా చెప్పుకుంటే పోతే.. కాపుల నాయకుల పేర్లే కనిపిస్తున్నాయి. యాదవ సామాజికవర్గం, క్షత్రియుల ప్రాబల్యం ఉన్నప్పటికీ కాపులనే ఫాలో అవుతారని పొలిటీషియన్స్ లెక్క. దీనిని పసిగట్టిన అమర్‌నాథ్.. భీమిలి సీటుపై కర్చీఫ్ వేసుకోవాలని చూస్తున్నారట..
అంతేగాక భీమిలి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు తన తాత అప్పన్న, తండ్రి గుర్నాథరావు ప్రాతినిధ్యం వహించిన సింహాచలం, మధురవాడ ప్రాంతాలు కూడా కలిసి ఉన్నాయి. ఇది కూడా తనకు ప్లస్ పాయింట్ అవుతుందనే ఈక్వేషన్స్‌తో అమర్‌నాథ్ భీమిలి వైపు వెళ్తున్నారని లోకల్ టాక్.. అంతేకాదు ఆ టికెట్ దక్కితే తన పొలిటికల్ ఫ్యూచర్‌కు ఢోకా ఉండదనే భావనలో ఆయన ఉన్నారనే తెలుస్తోంది.
ఆయన వస్తే తన సీటుకు ఎసరు వస్తుందని డైలామాలో అమర్నాథ్..!
ఐతే భీమిలి భీముడిని తానే అంటూ ఊహాల్లో విహరిస్తున్న అమర్‌నాథ్‌కు పిడుగులాంటి వార్త చెవిన పడిందట. అదే భీమిలి స్థానంపై పొరుగు జిల్లా నేత కూడా కన్నేశారనేది.. ఆయన వస్తే తన సీటుకు ఎసరు వస్తుందని అమర్‌నాథ్ డైలామాలో పడిపోయారని విశాఖ లోకల్ పాలిటిక్స్‌లో వినిపిస్తున్న గాసిప్. విజయనగరం జిల్లాకు చెందిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను భీమిలి సీటుపై గురిపెట్టారట. ఈయన మరెవరోకాదు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు స్వయాన మేనల్లుడు. బొత్సకు రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే, జిల్లా రాజకీయాల్ని శాసిస్తుంటారని పేరుంది. వైసీపీ అధినేత జగన్‌కు కూడా కాస్త సన్నిహితంగా కనిపిస్తారు. ఇక ఈ విషయం తెలిసినప్పటి నుంచి అమర్‌నాథ్‌కు కంటిమీద కునుకు ఉండడం లేదట.
అయితే విజయనగరం జిల్లాకు చెందిన చిన్న శ్రీను, విశాఖకు ఎందుకు వస్తున్నారనే అనుమానాలు కూడా లేకపోలేదు. అసెంబ్లీ లేదా పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహించాలని చిన్న శ్రీనుకు ఎప్పటి నుంచో కోరిక ఉంది. టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో చాన్స్ మిస్ చేసుకోవద్దనే ఆలోచనలో ఉన్నారట చిన్న శ్రీను. విజయగనరం జిల్లాలో ఇప్పటికే బొత్స కుటుంబీకులు చాలా స్థానాల్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎక్కడా ఖాళీ లేక చిన్న శ్రీను చూపు భీమిలిపై పడిందని టాక్ నడుస్తోంది.
క్యాస్ట్ ఈక్వేషన్స్‌పై గుడివాడ అమర్ ఆశలు పెట్టుకున్నట్లే.. చిన్న శ్రీను కూడా సేమ్ లెక్కలు వేసుకున్నారు. పైగా నియోజకవర్గంలోని మూడు మండలాల్లో చిన్న శ్రీను బంధుగణం ఉంది. దీంతో భీమిలి బెటర్ ఆప్షన్‌గా ఫీలవుతున్నారట చిన్న శ్రీను.
మొత్తానికి అవంతి శ్రీనివాస్ వదిలి వెళ్లిన భీమిలి స్థానాన్ని ఎవరికి కేటాయించాలని వైసీపీ అధినేత జగన్ డైలామాలో ఉన్నారని పార్టీలో ఇన్నర్ టాక్. గుడివాడ అమర్, చిన్నశ్రీను ఇద్దరూ మాజీ సీఎం జగన్‌కు చాలా క్లోజ్‌గా ఉంటారు. మరి ఈ ఇద్దరిలో ఎవరిని వద్దన్నా.. అసంతృప్త స్వరాలు వినిపించేలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్నది ఉత్కంఠగా మారింది.
Also Read : జగన్ మార్క్ రాజకీయం మొదలైందా? చెల్లి షర్మిలకు చెక్ పెట్టబోతున్నారా?