ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు..! పోతుల సునీత దారెటు?

మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర అనుచరులుగా పోతుల సునీత, ఆమె భర్త సురేశ్‌కు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు, గౌరవంతోనే టీడీపీలో పోతుల సునీతకు పెద్దపీట వేసే వారు.

ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు..! పోతుల సునీత దారెటు?

Gossip Garage : కోస్తా, రాయలసీమ, తెలంగాణ ఈ మూడు ప్రాంతాల్లోనూ రాజకీయం నెరిపిన చరిత్ర ఆ మహిళా నేతది. ఏ పార్టీలో ఉన్నా అధినేతలకు బాగా దగ్గరయ్యే నేర్పరితనం ఆమె సొంతం.. ఆ నేర్పు ఓర్పుతోనే చట్ట సభలకు ఎన్నిక కాకపోయినా, ఎమ్మెల్సీగా రెండుసార్లు అవకాశం దక్కించుకున్నారు. ఇక మూడోసారి తన పదవిని కాపాడుకోవాలని ముందుచూపుతో పార్టీ మారాలని అనుకున్నారు. అయితే ఆమె అంతరంగాన్ని పసిగట్టిన తెలుగు తమ్ముళ్లు రెడ్‌ సిగ్నల్‌ వేస్తూ ఎదురు తిరుగుతున్నారట. అధినేత ఆశీస్సులు ఉన్నా, తెలుగు తమ్ముళ్లు బ్రేక్‌ వేయడంతో ఆ మహిళా నేత పొలిటికల్‌ జెర్నీ జంక్షన్‌లో జామ్‌ అయిపోయినట్లైందట.. ఇంతకీ ఎవరా మహిళానేత..?

ఆ గుర్తింపుతో పోతుల సునీతకు టీడీపీలో పెద్ద పీట వేసిన చంద్రబాబు..
పోతుల సునీత… తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని లీడర్‌. విప్లవ నేపథ్యం నుంచి పాలిటిక్స్‌కు వచ్చిన పోతుల సునీత సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు. మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర అనుచరులుగా పోతుల సునీత, ఆమె భర్త సురేశ్‌కు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు, గౌరవంతోనే టీడీపీలో పోతుల సునీతకు పెద్దపీట వేసే వారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా అలంపూర్‌ నుంచి జడ్పీటీసీగా ఎన్నికైన సునీత.. ఆ తర్వాత రాయలసీమ రాజకీయాల్లో చక్రం తిప్పారు. మహిళ, బీసీ సామాజిక వర్గం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బాగా ప్రోత్సహించే వారు. ఇక 2014 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు సునీత. కానీ, అధినేత ఆశీస్సులతో 2017లో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. కట్‌ చేస్తే.. 2019లో అధికారం పోగానే వైసీపీలో చేరారు సునీత… ఆ తర్వాత ఎమ్మెల్సీగా రెండోసారి చాన్స్‌ కొట్టేశారు. ఇక తాజా ఎన్నికల్లో వైసీపీ ఓటమితో మళ్లీ సొంతగూటికి వచ్చేయాలని ప్లాన్‌ చేసుకున్నారట పోతుల సునీత.

పోతుల సునీతకు ఎదురుగాలి…
ఇంతవరకు తాను అనుకున్నది అనుకున్నట్లు సాధించుకున్న పోతుల సునీతకు ఇప్పుడు ఎదురుగాలి వీస్తోందని చెబుతున్నారు. చీరాల రాజకీయాల్లో టీడీపీ నాయకురాలిగా పట్టుసాధించిన సునీతకు… ఇప్పుడు అదే చీరాలలో ఎర్రజెండా చూపుతున్నారట తెలుగు తమ్ముళ్లు. పార్టీ కష్టకాలంలో ఉండగా, ఆదుకోవాల్సిన ఎమ్మెల్సీ…. పార్టీని వీడటంతోపాటు వైసీపీలో చేరాక పార్టీని, పార్టీ అధినేతను ఇష్టానుసారం విమర్శించడంతో సునీతను మళ్లీ చేర్చుకోవద్దని పట్టుబడుతున్నారట చీరాల టీడీపీ క్యాడర్. దీంతో పోతుల సునీత తిరిగి సొంతగూటికి చేరడం ఆలస్యమవుతోందా? అసలు ఆ ప్రతిపాదనే బుట్టదాఖలు అవుతుందా? అనే చర్చ మొదలైంది.

ఆదుకోవాల్సింది బాబు గారే అంటున్న సునీత..
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత… తన పదవికి, వైసీపీకి రాజీనామా చేసేశారు. మండలిలో టీడీపీకి సంఖ్యాబలం లేకపోవడంతో ఎమ్మెల్సీల చేరికను ప్రోత్సహించాలని ఆ పార్టీ అధిష్ఠానం ఆలోచనగా చెబుతున్నారు. ఐతే షరతులు వర్తిస్తాయి అన్నట్లు పార్టీ క్యాడర్‌ నుంచి వ్యతిరేకత లేని వారినే చేర్చుకుంటామనే కండీషన్‌ పెడుతున్నారట. ఈ పరిస్థితుల్లో చీరాలలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న పోతుల సునీత రీఎంట్రీకి చిక్కులు ఎదురవుతున్నాయంటున్నారు. పదవికి రాజీనామా చేస్తే.. తిరిగి టీడీపీలోకి చేర్చుకోవడంలో అభ్యంతరం లేదని ఓ మంత్రి హామీ ఇవ్వడంతో వేరే ఆలోచన లేకుండా వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు సునీత.

Also Read : కొల్లేరును క్లీన్ చేయడం సాధ్యమేనా? చంద్రబాబు ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్..

తీరా, అంతా అయ్యాక అల్లుడి నోట్లో శని అన్నట్లు కార్యకర్తలు ఎదురు తిరగడంతో తానేమీ చేయలేనని సదరు మంత్రి చేతులెత్తేస్తున్నారట. దీంతో రెండింటికీ చెడ్డ రేవడిలా తన పరిస్థితి తయారైందని మదనపడుతున్నారట పోతుల సునీత. ఇక ఈ పరిస్థితిలో ఆదుకోవాల్సింది బాబు గారేనంటూ సీఎం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారా? కార్యకర్తలకు నచ్చజెప్పి పోతుల సునీతకు లైన్‌క్లియర్‌ చేస్తారా? అన్నదే ఇప్పుడు ప్రకాశం పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్‌ మారింది.