Gossip Garage: ఏపీ బీజేపీ ప్రెసిడెంట్‌ ఎవరు.. మళ్లీ ఆమెకే పగ్గాలు ఇస్తారా? కొత్త వాళ్లు రాబోతున్నారా?

అధ్యక్ష ఎన్నిక కేవలం ఒక నాయకుడి ఎంపికకే పరిమితం కాదు. దీని వెనుక పార్టీ వ్యూహాత్మకంగా సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Gossip Garage: ఏపీ బీజేపీ ప్రెసిడెంట్‌ ఎవరు.. మళ్లీ ఆమెకే పగ్గాలు ఇస్తారా? కొత్త వాళ్లు రాబోతున్నారా?

Updated On : June 28, 2025 / 10:45 PM IST

Gossip Garage: అసలే కూటమి. పైగా ఆ రెండు పార్టీలతో సఖ్యత అవసరం. కేంద్రంలో, రాష్ట్రంలో వాళ్లిద్దరు బీజేపీకి కీలకం. సరిగ్గా ఇదే టైమ్‌లో ఏపీ బీజేపీ అధ్యక్ష ఎంపికకు వేళైంది. సామాజిక సమీకరణలు ఓవైపు..ఇద్దరు ముగ్గురు నేతల ప్రయత్నాలతో..కౌన్‌బనేగా ఏపీ కాషాయ దళపతి అనే డిస్కషన్ జరుగుతోంది. పురంధేశ్వరినే కంటిన్యూ చేస్తారా..లేక కొత్త నేతకు అవకాశం ఇస్తారా అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. పార్టీ పగ్గాలు దక్కేదెవరికి? ఎవరెవరు రేసులో ఉన్నారు?

ఏకంగా 14 రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ఎన్నుకునేందుకు అంతా సిద్ధమైంది. అందులో భాగంగా జూలై 1న ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక కూడా జరగనుంది. ఈ సారి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రేసులో పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పీవీ మాధవ్, యువనేతగా పేరు తెచ్చుకున్న విష్ణువర్ధన్‌రెడ్డి, పార్టీ తరఫున పోరాటాల్లో గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాశ్ నారాయణ్ వంటి నేతల పేర్లు అధ్యక్ష రేసులో వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరికి మరోసారి అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన కూడా పార్టీ అధిష్టానంలో చర్చకు వచ్చిందట. ఆమె పదవీకాలంలో పార్టీ ఓటు బ్యాంక్ క్రమంగా పెరిగిందన్న వాదన ఉంది.

అధ్యక్ష ఎన్నిక కేవలం ఒక నాయకుడి ఎంపికకే పరిమితం కాదు. దీని వెనుక పార్టీ వ్యూహాత్మకంగా సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వేరువేరు సామాజిక వర్గాల ప్రాతినిధ్యం బలోపేతం చేసేందుకు బీజేపీ శ్రద్ధ చూపుతోంది. కాపు, వెలమ, బీసీ, రెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందిన నేతల పరస్పర మద్దతు వంటి అంశాలపై కేంద్ర నాయకత్వం లోతుగా విశ్లేషిస్తోంది. రాష్ట్రంలో పార్టీ స్థిరత్వానికి, బలోపేతం దిశగా అధ్యక్ష ఎంపిక కీలకంగా మారింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆపై జరిగే 2029 అసెంబ్లీ ఎన్నికల దిశగా పార్టీని నడిపించే నేతను ప్రెసిడెంట్‌గా ఎన్నుకునే అవకాశం ఉంది.

దగ్గుబాటి పురంధేశ్వరినే తిరిగి కొనసాగిస్తారని అంటున్నారు. ఆమె 2023 జూలైలో బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ నియమావళి ప్రకారం రెండేళ్ల పాటు అధ్యక్ష పదవిలో ఉంటారు. అయితే మరో రెండేళ్ళ పాటు కూడా వారికి ఛాన్స్ వరుసగా ఇవ్వొచ్చు. అలా పురంధేశ్వరినే మళ్ళీ ప్రెసిడెంట్ చేయాలని పార్టీ కేంద్ర నాయకత్వం ఆసక్తిగా ఉందని అంటున్నారు. పురంధేశ్వరి 2023లో బాధ్యతలు స్వీకరించాక గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఏకంగా ఎనిమిది ఎమ్మెల్యేలు, మూడు ఎంపీ సీట్లు గెలిచింది. ఇక ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో వచ్చింది. దాంతో ఇద్దరు ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్ళారు.

Also Read: బీఆర్ఎస్‌లో ఫస్ట్ టైమ్.. కేటీఆర్‌, హరీశ్‌కు గెలుపు బాధ్యతలు..! కారు పార్టీకి లైఫ్‌ అండ్ డెత్‌గా జూబ్లీహిల్స్ బైపోల్..!

పురంధేశ్వరి బలమైన సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకులు కావడంతో పాటు నాన్‌ కాంట్రవర్సీ లీడర్. ఇక కేంద్రమంత్రిగా పనిచేసిన పురందేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె. ఆ ఇమేజ్ కూడా ఆమెకు ఉంది. ఏపీలో కూటమి పార్టీల మధ్య మంచి సయోధ్య ఉంది. దానిని అలా కొనసాగించేలా ఆమె చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె కంటే బెటర్ ఆప్షన్ ఎవరున్నారన్న చర్చ కూడా ఉంది.

వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. దాంతో పొత్తుల వంటి వాటి విషయంలో టీడీపీతో కోఆర్డినేట్ చేసుకోవాలంటే ఆమె అధ్యక్షురాలిగా ఉండటమే బెటర్ అని ఆలోచిస్తున్నారు. ఆమెను కాదని ఎవరిని తెచ్చినా మళ్లీ కొత్తగా ఉంటుందని పైగా టీడీపీతో కలసి పనిచేసే విషయంలో ఎలా ఉంటుందో అన్న చర్చ కూడా ఉంది. ఇక ఏపీలోని కూటమి పార్టీలు కూడా ఆమె అధ్యక్షురాలిగా ఉండటం పట్ల సంతృప్తిగానే ఉన్నాయంటున్నాయి. ఇలా అనేక రకాలైన ఈక్వేషన్స్‌తో ఆమెకే మళ్లీ ఛాన్స్‌ దక్కొచ్చన్న టాక్ వినిపిస్తోంది. మళ్లీ చిన్నమ్మకే అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారా..కొత్త నేతకు అవకాశం ఇస్తారా అనేది చూడాలి.